Mobile Popup Ad
Mobile Popup Ad

ఉత్కంఠగా క్వాలిఫయర్-2.. రాజస్థాన్‌పై గుజరాత్ అద్భుత విజయం..

కలం, వెబ్ డెస్క్:  న్యూ చండీఘడ్‌ వేదికగా రాజస్థాన్‌తో జరిగిన ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయం సాధించింది. రాజస్థాన్ ఇచ్చిన 215 పరుగుల స్కోర్‌ను గుజరాత్ బ్యాటర్లు 19 ఓవర్లలో ఛేదించారు. నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచ్‌లో జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 53 బంతుల్లో 104 పరుగులు చేసి గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రాజస్థాన్ ఓపెనర్లు ఎక్కడయితే ఫెయిల్ అయ్యారో అక్కడ గుజరాత్ గ్రాండ్ సక్సెస్ అయింది. అంతేకాకుండా బౌలింగ్ విషయంలో కూడా ప్రత్యర్థులను కట్టడిచేయడంలో రాజస్థాన్ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. మైదానంలో పరుగుల వరద పారించుకున్నారు. దీంతో ఫైనల్స్‌కు అడుగు దూరంలో రాజస్థాన్ ఆగిపోయింది. క్వాలిఫయర్-1లో ఆర్‌సీబీ చేతిలో చిత్తయినా.. క్వాలిఫయర్-2లో అద్భుత విజయం సాధించి గుజరాత్ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం 1 పరుగుకే మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో అవుట్ కాగా, ధ్రువ్ జురెల్ 7 పరుగులు మాత్రమే చేసి కాగిసో రబాడాకు దొరికిపోయాడు. ఆ దశలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడుతూ 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 96 పరుగుల సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీకి చేరువైన అతన్ని రబాడ అవుట్ చేశాడు. అతనికి అండగా నిలిచిన రవీంద్ర జడేజా 35 బంతుల్లో 45 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, కెప్టెన్ రియాన్ పరాగ్ 11 పరుగులు, దసున్ శనక 3 పరుగులు, జోఫ్రా ఆర్చర్ 7 పరుగులు చేసి జేసన్ హోల్డర్, ప్రసిద్ధ్ కృష్ణల బౌలింగ్‌లో వెనుతిరిగారు. చివర్లో డోనోవన్ ఫెరీరా కేవలం 11 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 38 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో రాజస్థాన్ భారీ స్కోరు సాధించగలిగింది.

గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో కాగిసో రబాడ 4 ఓవర్లలో 35 పరుగులిచ్చి 2 వికెట్లు, జేసన్ హోల్డర్ 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టారు. మహ్మద్ సిరాజ్ (1/42), ప్రసిద్ధ్ కృష్ణ (1/42) చెరో వికెట్ తీసుకోగా, వాషింగ్టన్ సుందర్ 2 ఓవర్లలో 23 పరుగులు, రషీద్ ఖాన్ 2 ఓవర్లలో భారీగా 45 పరుగులు సమర్పించుకొని వికెట్లేమీ సాధించలేకపోయారు.

అనంతరం 215 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది. గుజరాత్ ఓపెనర్లు జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగి కేవలం 53 బంతుల్లోనే 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 104 పరుగులు చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. అతనికి అద్భుతమైన సహకారం అందించిన మరో ఓపెనర్ సాయి సుదర్శన్ 32 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 58 పరుగులు చేసి బ్రిజేష్ శర్మ బౌలింగ్‌లో హిట్ వికెట్‌గా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్ 9 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 16 పరుగులు చేసి నాంద్రే బర్గర్ బౌలింగ్‌లో ఫెరీరాకు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. చివర్లో రాహుల్ తెవాటియా 9 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 17 పరుగులు, జోస్ బట్లర్ 9 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు.

రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ (1/45), నాంద్రే బర్గర్ (1/35), బ్రిజేష్ శర్మ (1/44) చెరో వికెట్ పడగొట్టారు. అయితే తుషార్ దేశ్‌పాండే 3 ఓవర్లలో 34 పరుగులు, యష్ రాజ్ పుంజా 2 ఓవర్లలో 29 పరుగులు, రవీంద్ర జడేజా 2 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి వికెట్లేమీ తీయలేకపోవడంతో రాజస్థాన్‌కు ఓటమి తప్పలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>