కలం, వెబ్ డెస్క్: ఏపీలో ఉద్యాన పంటల ద్వారా ఉత్పత్తి అవుతున్న ఫైబర్ కు ప్రోత్సాహం కల్పించాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబుతో గిరిరాజ్ సింగ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర జౌళి శాఖ మంత్రికి సీఎం పలు ప్రతిపాదనలు చేశారు. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో సాగు చేస్తున్న వివిధ పంటల ద్వారా పీచు, నార, ఫైబర్ ఉత్పత్తి అవుతుందని.. దీనిని వాణిజ్య స్థాయిలో విలువ జోడించేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని సీఎం కోరారు. పీచు వెలికితీతతో పాటు వస్త్ర పరిశ్రమకు ఉపయోగపడే ఉద్యానవన పంటల నివేదికను కేంద్ర మంత్రికి సమర్పించారు.
కేంద్ర మంత్రి ఎదుట కీలక ప్రతిపాదనలు..
అమరావతిలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ ఏర్పాటు చేయాలని కోరారు. ఫైబర్ ఉత్పత్తి అయ్యే ఉద్యాన పంటలతో రైతులకు అదనపు ఆదాయాలు వస్తాయని చెప్పారు. ఏపీలో కొబ్బరితో సహా వేర్వేరు పంటల ద్వారా పీచు ఉత్పత్తికి ఆస్కారం ఉందని తెలిపారు. కడప, అనంతపురం, నంద్యాల, పశ్చిమ గోదావరి, కృష్ణా, తూర్పు గోదావరి లాంటి అరటి పండించే జిల్లాలలో పోస్ట్-హార్వెస్ట్ విలువ ఆధారిత ప్రక్రియగా అరటి కాండం పీచు వెలికితీత కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఉద్యాన శాఖ సమన్వయంతో స్వయం సహాయక సంఘాల కోసం క్లస్టర్ ఆధారిత మెకానికల్ డెకోర్టికేటర్ యూనిట్లను ప్రోత్సహించేలా సహకారం అందించాలని చంద్రబాబు విన్నవించారు.
రాష్ట్ర తీర ప్రాంత జిల్లాల్లో కొబ్బరి పీచు పరిశ్రమను బలోపేతం చేసేలా ప్రస్తుత కాయిర్ బోర్డ్ డ్వాక్రా నెట్‌వర్క్ ద్వారా మెకనైజ్డ్ హస్క్ ప్రాసెసింగ్ యూనిట్లు, కాయిర్ జియో టెక్స్‌టైల్స్ పరిశ్రమల స్థాపనకు జౌళి శాఖ సహకారం కావాలని అడిగారు. ఏపీతోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల వస్త్ర పరిశ్రమ క్లస్టర్లకు సమీపంలో ఉన్న కుప్పంలో పీఎం మిత్రా పార్కును ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా అమరావతిలో చేనేత హస్త కళల మ్యూజియం ఏర్పాటుకు సహకారం ఇవ్వాలని విన్నవించారు.

