రాజస్థాన్ కోటను కూల్చిన టైటాన్స్.. గుజరాత్ ఘనవిజయం!

కలం, వెబ్ డెస్క్:  జైపూర్ వేదికగా జరిగిన IPL పోరులో గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్అన్ని విభాగాల్లో రాజస్థాన్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్‌లో పరుగుల సునామీ సృష్టించిన టైటాన్స్, ఆ తర్వాత బౌలింగ్‌లో రాజస్థాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. రాజస్థాన్ రాయల్స్‌ను 152 పరుగులకే ఆలౌట్ చేసి గుజరాత్ తన సత్తా చాటుకుంది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ గిల్ మెరిస్తే, బౌలింగ్‌ల రషీద్ ఖాన్ రఫ్ఫాడించాడు. నాలుగు వికెట్లు తీసి రాజస్థాన్‌ను పీకల్లోతు కష్టాల్లో పడేశాడు. రాజస్థాన్ ఫెయిల్ అయిన ప్రతి అంశంలో గుజరాత్ గ్రాండ్ సక్సెస్ అయింది.

మొదట బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. కెప్టెన్ గిల్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 84 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచారు. అతడికి తోడుగా సాయి సుదర్శన్ 36 బంతుల్లో 55 పరుగులు చేయడంతో తొలి వికెట్‌కే 118 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. చివర్లో వాషింగ్టన్ సుందర్ 20 బంతుల్లో 37 పరుగులు, రాహుల్ తెవాటియా 4 బంతుల్లో 14 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరు సాధించింది. రాజస్థాన్ బౌలర్లలో బ్రిజేష్ శర్మ రెండు వికెట్లు తీసుకోగా, పుంజా, జడేజా తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం కొండంత లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆదిలోనే చుక్కెదురైంది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 16 బంతుల్లో 36 పరుగులతో ఆశలు రేపినా, సిరాజ్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో పతనం మొదలైంది. కెప్టెన్ యశస్వి జైస్వాల్ (3), ధ్రువ్ జురెల్ (24) నిరాశపరిచారు. రవీంద్ర జడేజా 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచినా, మిగిలిన బ్యాటర్లు గుజరాత్ స్పిన్ మాయాజాలం ముందు నిలవలేకపోయారు.

గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ తన స్పిన్ మ్యాజిక్‌తో 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి రాజస్థాన్‌ను కోలుకోలేని దెబ్బ తీశారు. జేసన్ హోల్డర్ 3 వికెట్లతో చెలరేగగా, కాగిసో రబడ 2 వికెట్లు, మొహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాజస్థాన్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లో తమ బలమేంటో మరోసారి నిరూపించుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>