కలం, వెబ్ డెస్క్: ఢిల్లీ (Delhi)లో పలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోవడం, దెబ్బతిన్న రహదారుల వల్ల కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పారిశుద్ధ్య సేవలను మెరుగుపరచడం, రోడ్డు మరమ్మతులు, కాలుష్యాన్ని నియంత్రించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ)కి రూ.500 కోట్ల నిధులను విడుదల చేసింది.
ఢిల్లీ సచివాలయంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పారిశుద్ధ్య సంస్థలకు బాకీ చెల్లింపులు, చెత్త సేకరణలో లోపాలు, వివిధ కాలనీల్లో ఏర్పడిన అపరిశుభ్రతపై అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యానికి (Pollution) చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఏకంగా రూ.500 కోట్లు కేటాయించింది. ‘ఈ నిధులను పారిశుద్ధ్య పనులు, గుంతల పూడ్చివేత, ప్యాచ్ రిపేర్లకు వినియోగిస్తాం. దీని ద్వారా కాలుష్యం తగ్గించవచ్చు‘ అని ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. ‘పరిశుభ్రతే ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యం. ఇందులో ఎలాంటి రాజీ ఉండదు‘ అని ఆమె స్పష్టం చేశారు.
దెబ్బతిన్న రహదారులు (Roads), వాటిపై ఏర్పడ్డ గుంతలు కాలుష్యానికి ప్రధాన కారణాలుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో 500 కోట్లతో ఢిల్లీలో పనులు వేగవంతంగా జరుగబోతున్నాయి.


