కలం, కరీంనగర్: సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న తరుణంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కుల బహిష్కరణ ఘటనలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. బహిష్కరణ పేరుతో మానసిక వేదనకు గురిచేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు ఇంకా జరుగుతున్నాయడానికి కరీంనగర్ జిల్లా రామడుగు (Ramadugu) గౌడ సంఘంలో ఏర్పడిన వివాదమే నిదర్శనం.
పూర్తి వివరాల మేరకు మండల కేంద్రానికి చెందిన పొన్నం రామలక్ష్మి అనే మహిళకు గ్రామంలోని తాటి వనంలో సర్వే నెంబర్ 99/A లో 6 ఎకరాల 33 గుంటలు పట్టా భూమి ఉంది. అయితే గౌడ సంఘం సభ్యులు పొన్నం రామలక్ష్మీ వారసుల అనుమతి లేకుండా సంఘానికి ఆ భూమిని పట్టా చెయ్యాలని స్థానిక తహసిల్దార్ ను కోరారు. విషయం తెలుసుకున్న పొన్నం రామలక్ష్మి వంశస్థులు పంజాల కుటుంబీకులు ఆ రిజిస్ట్రేషన్ అడ్డుకున్నారు.
దీంతో కక్ష పెంచుకున్న గౌడ సంఘం సభ్యులు పొన్నం, పంజాల కుటుంబాలను గౌడ కులం నుంచి బహిష్కరించినట్లుగా తీర్మానం చేసుకొని వాట్సాప్ లో ప్రచారం చేశారు. అంతేకాకుండా ఆ రెండు కుటుంబాలతోని సంఘం సభ్యులు ఎవరైనా మాట్లాడితే 5000 రూపాయల జరిమానా విధిస్తామని పరోక్షంగా బెదిరింపులకు దిగి వరలక్ష్మి శుక్రవారం పండగ పూట బాధిత కుటుంబాలను మానసిక ఆందోళనకు గురి చేశారు.
దీంతో బాధిత కుటుంబ సభ్యులు కుల బహిష్కరణకు గురిచేసిన గోనెపల్లి రాజయ్య, గోనెపెల్లి దినేష్ ,అనుపురం శ్రీనివాస్ అనుపురం అనిల్, అనుపురం పరశురాములు పై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై కే రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

