కలం, ఖమ్మం బ్యూరో : మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మత్తు పదార్థాల నియంత్రణ చట్టం కింద నమోదయ్యే కేసుల దర్యాప్తులో ఎలాంటి చిన్నపాటి లోపాలకు కూడా తావులేకుండా, చట్టపరమైన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అధికారులను ఆదేశించారు. శనివారం కొత్తగూడెం(Kothagudem)లోని ఐఎంఈ ఫంక్షన్ హాల్లో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఈగల్ ఫోర్స్ ఎల్.హెచ్. రాజేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బందికి నిర్వహించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. డ్రగ్స్ రవాణాను అరికట్టేందుకు దర్యాప్తు నాణ్యతను మెరుగుపరచి నిందితులకు చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూడాలని ఎస్పీ సూచించారు.
ఎన్‌డీపీఎస్ కేసుల్లో నిందితుల గుర్తింపు, అరెస్టు, సీజర్ ప్రక్రియ, పంచనామా, సాక్ష్యాధారాల సేకరణ, ఛార్జ్‌షీట్ దాఖలు వరకు ప్రతి దశలోనూ పక్కాగా వ్యవహరించాలన్నారు. దర్యాప్తు సమయంలో చోటుచేసుకునే చిన్నపాటి పొరపాట్లు కూడా కోర్టు విచారణలో న్యాయపరమైన చిక్కులకు దారితీసే అవకాశం ఉన్నందున, చట్టంలోని నిబంధనలను నూటికి నూరు శాతం పాటించాలని స్పష్టం చేశారు. లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ కేసులను బలోపేతం చేయాలని దర్యాప్తు అధికారులకు మార్గదర్శనం చేశారు.
డ్రగ్స్ నిర్మూలనకు పోలీసులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎల్.హెచ్. రాజేశ్వరరావు పిలుపునిచ్చారు. చట్టంలోని వివిధ సెక్షన్లు, కోర్టు విచారణ సమయంలో ఎదురయ్యే సవాళ్లు, సాక్ష్యాధారాల పరిరక్షణపై పోలీసులకు సమగ్ర అవగాహన కల్పించారు. అనంతరం, పోలీసులకు విశేష శిక్షణ అందించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎల్.హెచ్. రాజేశ్వరరావు, ఫణి కుమార్‌లను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లందు, భద్రాచలం డిఎస్పీలతో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

