కలం వెబ్ డెస్క్ : బీహార్(Bihar)లోని జముయి జిల్లాలో శనివారం అర్ధరాత్రి ఘోర రైలు ప్రమాదం(train accident) జరిగింది. ఓ గూడ్స్ రైలు(goods train) వంతెనపై నుంచి కిందపడిపోయింది. దీంతో పది బోగీలు నదిలో మునిగిపోయాయి. ఓ గూడ్స్ రైలు సిమెంట్ లోడ్‌తో జసీడిహ్ నుంచి ఝాఝా వెళ్తుండగా సిముల్తాలా, తెల్వా హాల్ట్ స్టేషన్ల మధ్య దగ్గర బరువా నది వంతెన సమీపంలో ఈ ఘటన జరిగింది. రైలులో మొత్తం 42 బోగీలున్నాయి. ఇందులో 19 బోగీలు పట్టాలు తప్పాయి. 10 బోగీలు వంతెన నుంచి కింద పడి నదిలో మునిగాయి. మిగతావి పట్టాలపైనే చెల్లాచెదురుగా పడిపోయాయి.
ఈ ప్రమాదంతో ఢిల్లీ, హౌరా ప్రధాన మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. జసీడిహ్, ఝాఝా మధ్య కూడా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల షెడ్యూల్స్ దెబ్బతిన్నాయి. వందే భారత్ వంటి రైళ్లను కూడా ఇతర మార్గాలకు డైవర్ట్ చేశారు. ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారులు స్పందించి, ఎమర్జెన్సీ టీమ్స్, టెక్నికల్ సిబ్బంది, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యూనిట్లను ఘటనా ప్రాంతానికి పంపించారు. రైల్వే ట్రాక్‌పై బోగీలను తొలగించి పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ప్రమాదానికి గల కారణం తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.


