కలం, నల్లగొండ బ్యూరో: యాదగిరిగుట్ట (Yadadri Temple) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో బంగారు డాలర్ల వ్యవహారంలో చేతివాటం చూపిన ఉద్యోగులపై ఈవో సీరియస్ అయ్యారు. ప్రచారశాఖలో బంగారం, వెండి డాలర్లు మాయం చేసిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఆలయ విభాగంలోని ఇద్దరు సూపరింటెండెంట్ అధికారులకు చార్జ్ మెమోలు జారీచేశారు.
మరోవైపు ఆలయ ఏఈఓకు షోకాజు నోటీసులు జారీ చేశారు. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా ఆలయ ఈఓ భవానీ శంకర్ శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ప్రచారశాఖలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు జూనియర్ అసిస్టెంట్ పీ రామచంద్ర శేఖర్, రికార్డు అసిస్టెంట్ టీ లక్ష్మిపై సస్పెన్షన్ వేటు వేశారు. పర్యవేక్షణ బాధ్యతల లోపం కారణంగా సూపరింటెండెంట్లు నటరాజా, సీతారామ చార్యులకు మెమోలు ఇచ్చారు. ఇప్పటికైనా యాదాద్రి అంతర్గత భద్రత విషయంలో కఠినంగా లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే అవకాశం లేకపోలేదు.


