కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ (Future City)లో అంబానీ గ్రూపు ఆధ్వర్యంలో ‘వంతారా’ (Vantara Zoo Park) తరహా జూ పార్కు ఏర్పాటు కానున్నది. ఈ మేరకు గ్లోబల్ సమ్మిట్ (Global Summit) సందర్భంగా అంబానీ గ్రూప్ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు సమాచారం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో దాదాపు వెయ్యి ఎకరాలను ప్రభుత్వం అప్పగించే అవకాశమున్నది. ఇప్పటికే కడ్తల్, కురుమిద్ద, తాడిపర్తి గ్రామాల్లో అటవీ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు అధికారుల సమాచారం. గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా వంతారా గ్రూపు సీఈఓ వివాన్ కరాణి, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ షేక్ సాహిల్, రాజేంద్ర రాథోడ్, డైరెక్టర్ బ్రిజ్ కిషోర్ గుప్త, ప్రాజెక్టు కోఆర్డినేటర్ గౌరవ్ లునావత్ తదితరులతో ఈ నెల 8న మధ్యాహ్నం 3.00 గంటలకు పావుగంటపాటు చర్చలు జరగనున్నాయి. వంతారా గ్రూపు ప్రతినిధులు నెహ్రూ జూలాజికల్ పార్కును ఇటీవలే సందర్శించారు.
‘వంతారా జూ’లో తెలంగాణ ఫారెస్ట్ టీమ్ స్టడీ :
గుజరాత్‌లోని జామ్‌నగర్ జిల్లాలో అంబానీ గ్రూపు నెలకొల్పిన వంతారా జూ పార్కును తెలంగాణకు చెందిన అటవీ శాఖ బృందం గతేడాది సెప్టెంబరులో సందర్శించింది. అక్కడ జూ పార్కు నిర్వహిస్తున్న తీరును అధ్యయనం చేసింది. సుమారు 150 పులులు, 380 చిరుత పులులు, 850 మొసళ్ళు.. ఇలా మొత్తం 3 వేల వన్యప్రాణులు ఉన్నాయి. ముచ్చర్ల సమీపంలో కొత్త జూపార్కు నిర్మాణంలో భాగంగా వంతారా జూ పార్కులో అనుసరిస్తున్న విధానాలను తెలంగాణ పీసీసీఎఫ్ (అప్పటి) డోబ్రియాల్, ఐఎఫ్ఎస్ అధికారి (ప్రస్తుతం పీసీసీఎఫ్) సువర్ణ తదితర ఎనిమిది మంది బృందం అధ్యయనం చేసింది. తెలంగాణ సర్కార్ కొత్తగా నిర్మించనున్న జూ పార్కులో సఫారీ రైడ్, నైట్ క్యాంప్, నైట్ సఫారీ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేసి టూరిజం హబ్‌గానూ నిర్మించాలనుకుంటున్నది. ఇందులో భాగంగా గ్లోబల్ సమ్మిట్(Global Summit)లో అంబానీ గ్రూపుతో ‘వంతారా’ తరహా జూపార్కు ఏర్పాటుపై నిర్ణయం జరగనున్నట్లు తెలిసింది.
Read Also: రైల్వే మంత్రికి ఎంపీ వద్దిరాజు స్పెషల్ రిక్వెస్ట్
Follow Us On: Facebook


