Mobile Popup Ad
Mobile Popup Ad

చిట్యాల నోచ్ ల్యాబ్స్‌లో రియాక్టర్ పేలుడు..

కలం, నల్లగొండ బ్యూరో : చిట్యాల మండలం వెలిమినేడు సమీపంలోని నోచ్ ల్యాబ్స్ పరిశ్రమలో మరోసారి భారీ ప్రమాదం (Nosch Labs Blast) సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నం పరిశ్రమలోని మూడో నెంబర్ రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనలో 9 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే ప్రపంచవ్యాప్తంగా కార్మికులు తమ హక్కుల కోసం పోరాడి సాధించుకున్న ‘మే డే’ సెలవు దినాన కూడా యాజమాన్యం కార్మికులతో పనులు చేయించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్మికుల సంక్షేమాన్ని గాలికొదిలేసి, లాభార్జనే ధ్యేయంగా సెలవు రోజున కూడా పనులు నిర్వహించడం వల్లే ఈ ఘోరం జరిగిందని తోటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలావుంటే.. నోచ్ ల్యాబ్స్‌లో (Nosch Labs Blast) భద్రతా ప్రమాణాలు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో చెప్పడానికి ఈ వరుస ఘటనలే నిదర్శనం. సరిగ్గా నెల రోజుల క్రితమే ఇదే పరిశ్రమలో రియాక్టర్ పేలి ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. ఆ ఘటన మరువకముందే మళ్లీ అదే స్థాయిలో పేలుడు సంభవించడం కార్మికుల్లో భయాందోళనలను పెంచుతోంది. “పనికి వెళ్తే తిరిగి వస్తామో లేదో తెలియని పరిస్థితి ఉంది” అంటూ కార్మికులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, కార్మికుల బంధువులు పరిశ్రమ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. వరుస ప్రమాదాలు జరుగుతున్నా యాజమాన్యం భద్రతా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ​ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపడుతున్నారు.

Read Also: జాగృతి టు రక్షణ సేన… కవిత ట్విస్టుల మీద ట్విస్టులు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>