కలం, ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిని గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (TRS Chief Kavitha) విమర్శించారు. శుక్రవారం ఇంద్రవెల్లిలో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో రెండు ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే లక్షల ఎకరాలకు సాగునీరు అందేదన్నారు.
రైతులను పంటలు వేయవద్దని సూచించిన ముఖ్యమంత్రి అధికారంలో ఉండకూడదని కవిత వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లాకు ఒక్క ఎకరానికైనా సాగునీరు అందించిందా? అని ప్రశ్నించారు. చనాఖా-కొరటా ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.368 కోట్ల నుంచి రూ.2,100 కోట్లకు పెంచడంపై కేటీఆర్ సమాధానం చెప్పాలని, అవినీతి ఆరోపణలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సామాజిక న్యాయంలో భాగంగా రెండు ఎమ్మెల్సీ స్థానాలకు బీసీ అభ్యర్థులను ఎంపిక చేశామని కవిత (TRS Chief Kavitha) తెలిపారు. యువత, రైతులు, విద్య, వైద్యం అభివృద్ధికి తమ పార్టీ ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. అంతకుముందు ముత్నూర్లో కొమురం భీమ్ విగ్రహానికి, ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి, కొమురం భీమ్ విగ్రహానికి కవిత నివాళులర్పించారు. సభకు ఆదివాసీలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
నిర్మల్లో కృష్ణ సంతోష్ కుటుంబాన్ని కలిసిన కవిత..
ఇంద్రవెల్లిలో పాంచజన్య సంకల్ప సభ ముగించుకుని హైదరాబాద్కు వెళ్తున్న కవిత శుక్రవారం నిర్మల్ పట్టణంలో కొద్దిసేపు ఆగారు. స్థానికంగా నివాసముంటున్న పడిగెల కృష్ణ సంతోష్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. కుటుంబ సంబంధాల నేపథ్యంలోనే వారిని కలిసినట్లు, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని కవిత స్పష్టం చేశారు.

