కలం, స్పోర్ట్స్: ఒకప్పుడు యుద్ధం వల్ల దేశం వదిలి వెళ్లిన కుటుంబంలో పుట్టిన ఓ కుర్రాడు.. ఇప్పుడు వరల్డ్ కప్ వేదికపై చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా యువ ఫుట్‌బాలర్ నెస్టోరీ ఇరాంకుండా (Nestory Irankunda) టర్కీపై అద్భుతమైన గోల్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ గోల్‌తో వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా తరఫున గోల్ చేసిన అత్యంత చిన్న వయస్కుడిగా నిలిచాడు. మ్యాచ్‌లో టర్కీ డిఫెండర్లను దాటుకుంటూ వేగంగా ముందుకెళ్లిన ఇరాంకుండా, గోల్‌కీపర్‌ను మోసం చేస్తూ బంతిని నెట్‌లోకి పంపించాడు.
దీంతో అతనిపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడంతో పాటు రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇరాంకుండా కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అతని తల్లిదండ్రులు బురుండిలో జరిగిన యుద్ధం కారణంగా దేశం వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో టాంజానియాలోని ఒక శిబిరంలో ఇరాంకుండా (Nestory Irankunda) జన్మించాడు. తర్వాత వారి కుటుంబం ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరానికి వెళ్లి అక్కడే స్థిరపడింది.
చిన్నప్పటి నుంచే ఫుట్‌బాల్ (Foot Ball)పై ఆసక్తి చూపిన ఇరాంకుండా, 15 ఏళ్లకే అడిలైడ్ యునైటెడ్ సీనియర్ జట్టులో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ఆ తర్వాత జర్మనీకి వెళ్లి బాయెర్న్ మ్యూనిక్ రెండో జట్టులో ఆడాడు. అక్కడ 15 మ్యాచ్‌ల్లో నాలుగు గోల్స్ చేశాడు. తర్వాత స్విట్జర్లాండ్‌లోని గ్రాస్‌హాపర్ క్లబ్‌కు వెళ్లి 19 మ్యాచ్‌లు ఆడాడు. అనంతరం ఇంగ్లండ్ క్లబ్ వాట్‌ఫర్డ్‌తో ఐదేళ్ల ఒప్పందం చేసుకున్నాడు.
అంతర్జాతీయ స్థాయిలో కూడా అతని ప్రయాణం వేగంగా సాగింది. టాంజానియా, బురుండి, ఆస్ట్రేలియా జట్ల తరఫున ఆడే అవకాశం ఉన్నప్పటికీ, 2023లో ఆస్ట్రేలియా జట్టు నుంచి తొలి పిలుపు అందుకున్నాడు. ఇరాంకుండా ఒక్కరే కాదు. ఆస్ట్రేలియా జట్టులోని మరో ఇద్దరు ఆటగాళ్ల కథలు కూడా ఇలాగే ఉన్నాయి. మహమ్మద్ టూరే గినియాలోని ఒక తాత్కాలిక నివాస కేంద్రంలో జన్మించాడు.
తర్వాత అతని కుటుంబం కూడా అడిలైడ్‌కు వెళ్లింది. అక్కడే టూరే, ఇరాంకుండా మంచి స్నేహితులయ్యారు. మరో ఆటగాడు అవర్ మాబిల్ కెన్యాలో జన్మించాడు. ప్రస్తుతం స్పెయిన్‌లోని కాస్టెలోన్ క్లబ్‌కు ఆడుతున్న అతనికి ఇది రెండో వరల్డ్ కప్. ఇక నార్విచ్ తరఫున ఆడుతున్న టూరే, ఇరాంకుండా మాత్రం తమ తొలి వరల్డ్ కప్ అనుభవాన్ని ఆస్వాదిస్తున్నారు. కష్టమైన పరిస్థితుల్లో మొదలైన వీరి ప్రయాణం ఇప్పుడు వరల్డ్ కప్ వేదిక వరకు చేరింది. ఈ ముగ్గురి కథలు ఆస్ట్రేలియా జట్టులో ప్రత్యేకంగా నిలిచాయి.
Read Also: దీప్తి శర్మ మెరుపులు.. చిత్తయిన పాకిస్థాన్
Follow Us On: X(Twitter)

