Mobile Popup Ad
Mobile Popup Ad

దీప్తి శర్మ మెరుపులు.. చిత్తయిన పాకిస్థాన్

కలం, వెబ్ డెస్క్ : పాకిస్థాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత మహిళా ప్లేయర్లు వీరవిహారం చేశారు. బ్యాటర్లలో స్మృతి మందాన బౌండరీల వర్షం కురిపిస్తే, బౌలింగ్‌తో దీప్తి శర్మ (Deepti Sharma) మెరుపులు మెరిపించారు. మొత్తానికి పాకిస్థాన్ జట్టును 106 పరుగులకే ఆలౌట్ చేసింది. ఇక పాక్ టీమ్‌లో చూసుకుంటే బౌలింగ్‌లో ఫాతిమా సనా కాస్తంత సక్సెస్ అయ్యారనే చెప్పాలి. బ్యాటింగ్‌లో ఓపెనర్ మునీబా అలి మినహా మరెవరూ 20 పరుగులు కూడా దాటలేదు. దీంతో పాకిస్థాన్‌కు ఘోర పరాజయం అనివార్యమైంది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే షెఫాలీ వర్మ (6), జెమిమా రోడ్రిగ్స్ (1) వికెట్లు కోల్పోయి షాక్ తగిలింది. ఈ దశలో వైస్ కెప్టెన్ స్మృతి మందాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. మందాన కేవలం 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేసి పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. హర్మన్‌ప్రీత్ 36 పరుగులతో కీలక సహకారం అందించారు. ఆఖర్లో రిచా ఘోష్ కేవలం 17 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 34 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగుల భారీ స్కోరు సాధించారు. పాక్ బౌలర్లలో సాదియా ఇక్బాల్, ఫాతిమా సనా చెరో రెండు వికెట్లు తీశారు.

171 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా దీప్తి శర్మ తన 4 ఓవర్లలో కేవలం 10 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి పాక్ బ్యాటింగ్ లైన్అప్‌ను కుప్పకూల్చారు. మరో బౌలర్ శ్రీ చరణి 3 వికెట్లతో దీప్తికి చక్కని సహకారం అందించారు. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ మునీబా అలీ (41) మినహా మిగిలిన వారంతా ఘోరంగా విఫలమయ్యారు. కెప్టెన్ ఫాతిమా సనాతో సహా ముగ్గురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఒక దశలో 4 వికెట్లకు 75 పరుగులతో ఉన్న పాక్.. భారత బౌలర్ల ధాటికి కేవలం 31 పరుగుల వ్యవధిలోనే మిగిలిన 6 వికెట్లు కోల్పోయి 17 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌట్ అయింది.

మ్యాచ్ అనంతరం ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న దీప్తి శర్మ మాట్లాడుతూ.. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుండటంతో బంతి బంతికి వేగాన్ని మారుస్తూ నెమ్మదిగా బౌలింగ్ చేయడం తనకు కలిసి వచ్చిందని అన్నారు. ఐసీసీ టోర్నీలలో ఆడటం తనకు ఎంతో ఇష్టమని, స్మృతి, హర్మన్‌ప్రీత్ భాగస్వామ్యమే మ్యాచ్ మలుపు తిప్పిందని పేర్కొన్నారు. స్టేడియానికి వచ్చి ఇంతగా మద్దతు తెలిపిన అభిమానులందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>