కలం, వెబ్ డెస్క్ : ప్రపంచ ఆర్చరీలో అజేయంగా భావించే దక్షిణ కొరియాకు భారత యువ జోడీ షాక్ ఇచ్చింది. ఒలింపియన్ ధీరజ్ బొమ్మదేవర, 17 ఏళ్ల కుంకుమ్ మొహోద్ అద్భుత ప్రదర్శనతో ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-3 (Archery World Cup)లో రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. టర్కీలోని అంతాల్యాలో జరిగిన ఫైనల్లో భారత జోడీ 5-1 తేడాతో కొరియా జట్టును ఓడించింది. ఒలింపిక్ ఛాంపియన్లతో జరిగిన పోరులో ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ధైర్యంగా ఆడిన ధీరజ్, కుంకుమ్ చివరి వరకు ఆధిపత్యం ప్రదర్శించారు.
మ్యాచ్ ఆరంభం నుంచే భారత్ దూకుడుగా కనిపించింది. తొలి సెట్‌ను 37-36తో గెలిచిన భారత జోడీ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో సెట్‌లోనూ అదే జోరు కొనసాగించి మరోసారి 37-36తో విజయం సాధించింది. దీంతో భారత్ 4-0 ఆధిక్యంలో నిలిచింది. స్వర్ణం కోసం కేవలం మరో సెట్ చాలు అనుకున్న సమయంలో కొరియా గట్టి పోటీ ఇచ్చింది. మూడో సెట్‌లో రెండు జట్లు 39-39తో సమంగా నిలిచాయి. అయితే సెట్ పాయింట్ల ఆధారంగా భారత్ 5-1తో మ్యాచ్‌ను ముగించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో (Archery World Cup) ధీరజ్ చివరి బాణంతో పర్ఫెక్ట్ 10 స్కోర్ చేయడం కీలకంగా మారింది. కుంకుమ్ కూడా ఒత్తిడి సమయంలో అద్భుత షాట్లతో జట్టుకు అండగా నిలిచింది. ఇద్దరూ తలా మూడు 10లు నమోదు చేసి ఆకట్టుకున్నారు. ధీరజ్‌కు ఇది తొలి వరల్డ్ కప్ మిక్స్‌డ్ టీమ్ స్వర్ణ పతకం. గతంలో అతను రెండు సార్లు కాంస్య పతకాలు గెలిచాడు. మరోవైపు ఈ సీజన్‌లోనే వరల్డ్ కప్ అరంగేట్రం చేసిన కుంకుమ్ వరుసగా రెండో స్వర్ణ పతకాన్ని అందుకుంది.
Read Also: రిఫుజీ క్యాంప్ నుంచి వరల్డ్ కప్ చరిత్రలోకి ఇరాంకుండా
Follow Us On : WhatsApp

