కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: పాలమూరు జిల్లాకు చెందినవాడినని పదేపదే చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) జిల్లాకు తీరని అన్యాయం చేస్తున్నారని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి నివాసంలో మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై పార్టీ పరిస్థితులపై సమీక్షించారు.
ఈ సందర్భంగా నేతల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్న కేటీఆర్, రాబోయే ఎన్నికలలో మహబూబ్‌నగర్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టి సమాధానం ఇస్తారని అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఓటమి ఖాయమని కేటీఆర్ పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్టులను పక్కనపెట్టి రాజకీయ విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తికి దగ్గరగా ఉన్నా కమిషన్ల కోసం ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి సమర్థవంతంగా తీసుకెళ్లలేకపోవడమే ఓటమికి కారణమని కేటీఆర్ (KTR) ఒప్పుకున్నారు. ఈసారి పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ప్రజలలోకి వెళ్లాలని సూచించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ కార్యక్రమాలను బలోపేతం చేయాలని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ నేతలకు సూచించారు.
ఈ సమావేశంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సి. లక్ష్మా రెడ్డి, ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామ్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే విజేయుడు, మాజీ ఎంపీలు మన్నె శ్రీనివాస్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు.
Read Also: కేటీఆర్ అసత్య ప్రచారాలను నమ్మొద్దు: ప్రభుత్వ విప్ వేముల
Follow Us On: Instagram

