కలం, వెబ్ డెస్క్ : మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించి, తమ కాళ్లపై తాము నిలబడాలనే లక్ష్యంతో హైదరాబాద్ పోలీస్ విభాగం ఒక అద్భుతమైన అవకాశాన్ని ముందుకు తెచ్చింది. నగరంలోని మహిళలకు ఉచితంగా డ్రైవింగ్ నేర్పించడంతో పాటు, వారికి ఉపాధి కల్పించే దిశగా ‘డ్రైవర్ ఉద్యోగ మేళా’ (Driver Job Fair) ను నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ (CP Sajjanar) ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా వివరాలను వెల్లడించారు.
ఈ ఉపాధి మేళా జనవరి 3వ తేదీన అంబర్ పేట్ లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (PTC) లో జరగనుంది. డ్రైవింగ్ రంగంపై ఆసక్తి ఉండి, సరైన శిక్షణ లేని మహిళలకు ఇది ఒక గొప్ప వేదిక కానుంది. నిపుణుల పర్యవేక్షణలో ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనున్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన వారై ఉండి, వయస్సు 21– 45 ఏళ్ల మధ్య ఉండాలి. డ్రైవింగ్‌లో ముందస్తు అనుభవం లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చు.
కేవలం శిక్షణ ఇవ్వడమే కాకుండా, శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు డ్రైవర్లుగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈ మేళా ప్రధాన ఉద్దేశ్యం. ‘మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. స్టీరింగ్ పట్టి తమ జీవిత గమనాన్ని తామే మార్చుకోవాలి’ అని సీపీ సజ్జనార్ (CP Sajjanar) పిలుపునిచ్చారు. అర్హత ఉన్న మహిళలందరూ జనవరి 3న అంబర్ పేట్ ట్రైనింగ్ సెంటర్ కు హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Read Also: కుల్దీప్ కు మరణశిక్ష పడేదాకా పోరాడుతా.. ఉన్నావ్ బాధితురాలు
Follow Us On: Youtube


