కలం, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరలు (Fuel Price Hike) పెరిగాయి. గత పదిరోజులలోనే ఇది నాలుగోసారి పెరుగుదల కావడం ప్రజలలో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా చమురు కంపెనీలు లీటరు పెట్రోల్‌పై రూ.2.84, లీటరు డీజిల్‌పై రూ.2.86 పెంచినట్లు ప్రకటించాయి. పెరిగిన ధరలు ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే అమలులోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పెరుగుదల, డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం వంటి కారణాలతో ఇంధన ధరలు వరుసగా పెరుగుతున్నాయని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి. అయితే, తరచూ జరుగుతున్న ధరల పెంపుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇంధన ధరల పెరుగుదల ప్రభావం రవాణా రంగంపై మాత్రమే కాకుండా నిత్యావసర వస్తువుల ధరలపైనా పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కూరగాయలు, సరుకు రవాణా ఖర్చులు పెరగడంతో ద్రవ్యోల్బణం మరింత అధికమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పెరిగిన జీవన వ్యయాలతో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి, సాధారణ ప్రజలకు ఈ తాజా పెంపు మరింత భారంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

