కలం, మెదక్ బ్యూరో : రాబోయే రోజుల్లో ఎల్ నినో ప్రభావంతో తీవ్ర కరువు కాటకాలు, వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy) అన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం జనగామ గ్రామంలో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో మంత్రులు వెంకటస్వామి పాల్గొని ఆయిల్ పామ్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావం ఉండడంతో రైతులు ఆరుతడి పంటల వైపు మళ్లాలని, లాభదాయకమైన ఆయిల్ పామ్ సాగు చేయాలని సూచించారు.
సిద్దిపేట జిల్లాలో 50 వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రస్తుతం 14 వేల ఎకరాలకు పైగా సాగు అవుతోందననారు. రైతులను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలను ఇస్తుందని గుర్తు చేశారు. ఆయిల్ పామ్ సాగు చేసిన మొదటి 4 సంవత్సరాల వరకు రైతులు అంతర పంటలు కూడా వేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం దీనికి సబ్సిడీ ఇవ్వడంతో పాటు ‘రైతు భరోసా’ కూడా అందిస్తుందని, ఎకరాకు రూ. 50 వేల చొప్పున సబ్సిడీ వస్తుందని వివరించారు. ఈ పంట వల్ల కోతుల బెడద ఉండదని, వాతావరణ మార్పుల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.
ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నాయని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. భవిష్యత్తులో ఆయిల్ పామ్ దిగుమతి చేసుకుంటే మరిన్ని ఇబ్బందులు తప్పవని, అందుకే మన దేశంలోనే ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వరితో పోలిస్తే ఆయిల్ పామ్ సాగుకు పెద్దగా నీళ్లు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. హుస్నాబాద్‌కి సమీపంలోనే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అందుబాటులో ఉన్నందున, రైతులు ఎక్కువగా ఆయిల్ పామ్ సాగు చేస్తే తక్కువ శ్రమతో అధిక లాభాలు గడించవచ్చని రైతులకు మంత్రి వివేక్ సూచించారు.

