కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రైతుల సమస్యలను పరిష్కరించడానికి, వారికి భరోసా ఇవ్వడానికి క్షేత్ర స్థాయి పర్యటనకు రాష్ట్ర బీజేపీ (Telangana BJP) నాయకత్వం శ్రీకారం చుట్టింది. ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మొండివైఖరి ప్రదర్శిస్తోందంటూ పోరుబాటకు సిద్దమయింది. ‘రైతు ఘోష-బీజేపీ భరోసా’ పేరుతో ఉద్యమానికి పిలుపునిచ్చిన కాషాయపార్టీ.. నేటి నుంచి మూడు రోజుల పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు బీజేపీ నాయకులు చేరుకొని.. రైతుల సమస్యలపై గళం విప్పాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా నేడు బీజేపీ (Telangana BJP) రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు (Ramchander Rao) నేతృత్వంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకోనున్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కులకచర్ల నుంచి బీజేపీ నాయకులు ఈ పోరుబాటను ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు కులకచర్ల రైతులకు బీజేపీ ముఖాముఖి కార్యక్రమం ఉంటుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డు సందర్శన సాయంత్రం ఐదు గంటలకు ఉంటుందని తెలిపాయి. మంగళవారం యాదాద్రి భువనగిరి, జనగాం, వరంగల్ జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్నారు.
Read Also: రైతు డిస్కమ్ వద్దు.. అనుమతి ఇవ్వొద్దంటూ ఈఆర్సీకి రిక్వెస్టులు
Read Also: సర్కారు ఆసుపత్రులు అస్తవ్యస్తం

