కలం, వెబ్‌డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మాజీ పేసర్.. డోపింగ్ టెస్ట్(Doping Test)లో దొరికిపోయాడు. దీంతో భారత దేశవాళీ క్రికెట్‌లో అరుదుగా కనిపించే డోపింగ్ ఘటన ఒకటి ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. ఉత్తరాఖండ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ రాజన్ కుమార్ (Rajan kumar) నిషేధిత పదార్థాలు వాడినట్టు తేలింది. దీంతో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అతడిపై తాత్కాలిక నిషేధం విధించింది. రాజన్ చివరి సారిగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (Syed Mushtaq Ali Trophy) 2025లో ఉత్తరాఖండ్ తరఫున ఆడాడు. డిసెంబర్ ఎనిమిది 2025న అహ్మదాబాద్‌లో జరిగిన గ్రూప్ డీ మ్యాచ్‌లో ఢిల్లీపై అతడి తాజా ప్రదర్శన కనిపించింది. నిషేధం వార్త వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రాజన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
నివేదికల ప్రకారం.. అతడి (Rajan kumar) నమూనాలో రెండు అనాబాలిక్ స్టెరాయిడ్లు, డ్రోస్టనోలోన్ మెటెనోలోన్‌తో పాటు క్లోమిఫిన్ కూడా ఉన్నట్టు తేలింది. క్లోమిఫిన్ సాధారణంగా మహిళల్లో వంధ్యత్వ చికిత్సకు వాడే ఔషధం. అయితే పురుషుల్లో టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని పెంచే లక్షణం ఉండటంతో యాంటీ డోపింగ్ నిబంధనల ప్రకారం ఇది నిషేధిత పదార్థాల జాబితాలోకి చేరింది. ఇటీవల కాలంలో భారత్‌లో డోపింగ్ సమస్యపై మరింత దృష్టి పడుతోంది. క్రికెట్ క్లీన్ స్పోర్ట్ (Cricket Clean Sport)గా పేరు తెచ్చుకున్నప్పటికీ అన్ని క్రీడలను కలిపి చూస్తే వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ జాబితాలో అత్యధిక ఉల్లంఘనలు నమోదైన దేశంగా భారత్ వరుసగా 3 సంవత్సరాలు నిలిచింది. 2030 కామన్వెల్త్ గేమ్స్‌ను అహ్మదాబాద్‌లో నిర్వహించాలనే లక్ష్యం, 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలనే ఆశల నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు మరింత సున్నితంగా మారింది.
భారత క్రికెట్‌లో డోపింగ్ కేసులు చాలా అరుదు. చివరిసారిగా పెద్ద స్థాయిలో చర్చకు దారి తీసిన ఘటన 2019లో జరిగింది. అప్పట్లో బ్యాటర్ పృథ్వీ షా టెర్బ్యూటాలిన్ వాడినట్టు తేలడంతో బీసీసీఐ అతడిపై 8 నెలల నిషేధం విధించింది. అయితే దగ్గు మందు వల్ల అనుకోకుండా ఇలా జరిగిందని షా అప్పట్లో వివరణ ఇచ్చాడు. అదేవిధంగా 2020లో మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ అన్షులా రావు(Anshula Rao) కూడా డోపింగ్ నేరంలో దోషిగా తేలాడు.
Read Also: కవిత ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి : ఎంపీ రఘునందన్ రావు
Follow US : Twitter


