కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay), కుమారుడు బండి భగీరథ్ (Bandi Bhageerath) పై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ (Sunke Ravi Shankar) కోరారు. కరీంనగర్ (Karimnagar) జిల్లా గంగాధర మండల కేంద్రంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 17 ఏళ్ల మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోక్సో కేసు నమోదు అయిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ అంశంపై కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రశ్నించారు. మైనర్ బాలిక ఫిర్యాదు వంటి అత్యంత సున్నితమైన అంశంలో ప్రభుత్వం, పోలీసులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించి బాధితురాలికి తక్షణ న్యాయం చేయాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు.
కేసు నమోదై 48 గంటలు గడుస్తున్నా చర్యలు తీసుకోకపోవడంపై ఆయన ధ్వజమెత్తారు. బండి భగీరథ్ ఇప్పటికీ ఎక్కడ ఉన్నాడు..? ఎందుకు అరెస్టు చేయడం లేదు..? చట్టం సామాన్యులకేనా? అని ప్రశ్నించారు. చట్టం సామాన్యులకు ఒకలాగా, అధికార పార్టీలకు మరోలా అమలవుతుందని రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి అమ్మనవుతా! అంటూ గతంలో ప్రగల్భాలు పలికిన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. బాధిత బాలికకు అన్యాయం చేయాలని మధ్యవర్తిత్వం వహించిన సంగప్పపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల భద్రత, బాలికల రక్షణ గురించి గొప్పలు చెప్పుకుంటూ ఇలాంటి కీలక వ్యవహారాల్లో ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. బీజేపీ “బేటీ బచావో” నినాదం నిజమైతే బండి సంజయ్ కుమార్‌ను వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలు మైనర్ కావడంతో ఈ కేసును అత్యంత ప్రాధాన్యతతో తీసుకొని, రాజకీయ ఒత్తిళ్లు, హోదాలు పక్కనపెట్టి వెంటనే బండి భగీరథ్‌ను అరెస్టు చేయాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

