కలం, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో సోమవారం నుంచి ‘జనగణన’ (Khammam) ప్రారంభమైంది. ఈ గణనలో భాగంగా గృహాల జాబితా సేకరణ కార్యక్రమం మొదలుపెట్టారు. సాంకేతికతను జోడించి, డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తుండటం ఈ సెన్సస్ ప్రత్యేకత. జనగణన ప్రక్రియను ప్రభుత్వం రెండు ప్రధాన దశలుగా విభజించిన విషయం తెలిసిందే. మొదటి దశ సెప్టెంబర్ వరకు గృహాల జాబితా సేకరణ. ఇందులో ఇళ్ల నిర్మాణం, సౌకర్యాలపై దృష్టి పెడతారు. రెండో దశ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉంటుంది. ఇందులో జనాభా లెక్కింపు వుంటుంది. ఇది పూర్తిస్థాయిలో డిజిటల్ విధానంలో జరుగుతుంది.
కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రక్రియ
జిల్లా స్థాయిలో కలెక్టర్ చీఫ్ సెన్సెస్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తూ ఈ ప్రక్రియను నడిపిస్తున్నారు. అదనపు కలెక్టర్లు, డీఆర్వోలు, వివిధశాఖల అధికారులు సమన్వయకర్తలుగా పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు బాధ్యతలను భుజాన వేసుకున్నారు.
స్వీయగణనకు లభించని స్పందన
ప్రజలు స్వచ్ఛందంగా తమ వివరాలను నమోదు చేసుకునేందుకు ‘స్వీయ గణన’ అవకాశం కల్పించినప్పటికీ, ఉమ్మడి జిల్లాల్లో దీనిపై ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. దీనిని ఐచ్ఛికం చేయడమే ఇందుకు ప్రధాన కారణం కావచ్చు. అయితే, దీనివల్ల ఎన్యూమరేటర్లు నేరుగా ఇంటికి వచ్చినప్పుడు సమాచార సేకరణ మరింత వేగవంతం కానుంది. కాగా, ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో సుమారు 8.51 లక్షల గృహాల సమాచారాన్ని సేకరించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోంది. ఇందులో భాగంగా ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటిని సందర్శించి 34 రకాల ప్రశ్నల ద్వారా డేటాను సేకరిస్తారు. ప్రధానంగా,ఇంటి నిర్మాణ స్వభావం (పక్కా ఇళ్లా లేక కచ్చా ఇళ్లా). కుటుంబ సభ్యుల సంఖ్య, విద్యార్హతలు, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల లభ్యత వంటి అంశాలపై వివరాలు నమోదు చేస్తున్నారు.
జూన్ 9 నాటికి ముగియనున్న ప్రక్రియ
గతంలో కాగితం, కలంతో జరిగిన సర్వే ఈసారి మొబైల్ యాప్‌ల ద్వారా సాగుతోంది. ఇది సమాచార సేకరణలో పారదర్శకతను పెంచడమే కాకుండా, డేటా విశ్లేషణను వేగవంతం చేస్తుంది. ప్రతి ఆరుగురు గణకులకు ఒక సూపర్వైజర్ పర్యవేక్షణ ఉండటం వల్ల తప్పులకు తావులేకుండా చూసుకుంటున్నారు. ఈ ప్రక్రియ జూన్ 9 నాటికి ముగియనుంది.
అంకెల సేకరణ కాదు.. రేపటి అభివృద్ధికి పునాది
జనగణన (Census) అనేది కేవలం అంకెల సేకరణ మాత్రమే కాదు, అది రేపటి అభివృద్ధికి పునాది. కాబట్టి ఖమ్మం, భద్రాద్రి జిల్లాల ప్రజలు తమ ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్లకు సరైన వివరాలు అందించి, ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని జిల్లా యంత్రాంగం ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. మరో పక్క అధికారుల శిక్షణ, సాంకేతికత వినియోగం చూస్తుంటే, ఈసారి గృహ గణన అత్యంత కచ్చితత్వంతో జరుగుతుందనీ స్పష్టం అవుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 8.51 లక్షల గృహాలు ఉండగా, 26 లక్షల పై చిలుకు జనాభా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే రెండు జిల్లాల్లో కలిపి 4,565 మంది ఎన్యూమరేటర్లు, 826 మంది సూపర్వైజర్లు జనాభా లెక్కల క్రతువులో పాల్గొననున్నారని అధికారులు వివరాలు వెల్లడించారు.
భద్రాచలం మండలంలో 78 మంది ఎన్యూమరేటర్లు జనగణన లో పాల్గొంటున్నారు. ఒక్కో ఎన్యూమరేటర్ ఈ నెల రోజుల్లో సుమారు 200 గృహాలకు సంబంధించిన సమాచారం సేకరించాల్సి ఉంటుంది. అలాగే 13 మంది సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్ల పని తీరును పర్యవేక్షిస్తారు. వీరికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరిగింది.
– భద్రాచలం తహసీల్దార్ వెంకటేశ్వర్లు
నా పర్యవేక్షణలో 6గురు ఎన్యూమరేటర్లు ఉంటారు. రాజుపేట కు జగదీష్ కాలనీకి మద్యలో ఉన్న ప్రాంతంలో జనగణన చేస్తున్నాము. ప్రస్తుతం ఏరియాను ఐడెంటిఫై చేసి, లే అవుట్ మ్యాపులు సిద్ధం చేసుకుంటున్నాము. 14 వ తేదీ వరకు ఇళ్లకు నెంబర్లు ఇస్తాము. తర్వాత జనగణన ప్రారంభిస్తాము. తహసీల్దార్ ఆఫీస్ సిబ్బంది మాకు ఉన్న అనుమానాలు నివృత్తి చేయడం జరిగింది. కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ కూడా చేస్తున్నారు.
– భాలేందర్, సూపర్ వైజర్, భద్రాచలం
Read Also: రేవంత్ పాలనలో బడులే కాదు.. గుడుల విధ్వంసం జరుగుతోంది: హరీశ్ రావు
Follow Us On : WhatsApp

