రేవంత్ పాలనలో బడులే కాదు.. గుడుల విధ్వంసం జరుగుతోంది: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: రేవంత్ రెడ్డి పాలనలో బడులు ఆగమే కాదు.. ఏకంగా గుడుల విధ్వంసం కూడా జరుగుతోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో ధ్వంసం చేసిన 800 ఏళ్ల చరిత్ర గల కాకతీయుల నాటి మట్టికోట శివాలయాన్ని హరీశ్ రావు సందర్శించారు. కూల్చివేతకు గురైన ఆలయ ప్రాంగణంలో స్థానికులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పర్యటనలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. శివాలయ సందర్శన అనంతరం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి అర్ధాంతరంగా నిలిపేశారని హరీశ్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పుణ్యమా అని ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందని విమర్శించారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి వంద శాతం రుణమాఫీ చేయకుండా మాట తప్పిన తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. కేసీఆర్ యాదాద్రి లాంటి మహా పుణ్యక్షేత్రాలను నిర్మిస్తే, రేవంత్ రెడ్డి మాత్రం హైడ్రా పేరుతో పేదల ఇండ్లు, మసీదులు, చర్చీలు, ఇప్పుడు ఏకంగా గుడులు కూలగొడుతున్నాడని మండిపడ్డారు. సీఎం అయిన కొత్తలో సెక్రటేరియట్ కు పోతే లంక బిందెలు దొరుకుతాయనుకున్నా అని రేవంత్ రెడ్డి అన్నాడని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి అనుయాయులతో కలిసి నిజాం భవనాల చుట్టూ గుప్త నిధుల కోసం బాగానే వెతికాడని ఎద్దేవా చేశారు. అక్కడ దొరకకపోయే సరికి ఇప్పుడు కాకతీయుల గుడుల మీద పడ్డాడని విమర్శించారు. అశోక్ నగర్ లో కాకతీయ గణపతి దేవుడు నిర్మించిన 800 ఏళ్ల నాటి అద్భుతమైన శివాలయాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చేశారని ఆరోపించారు.

శివాలయాన్ని రాత్రి 12 నుంచి 1 గంట మధ్య, చీకట్లో గర్భగుడి కింద ఏకంగా 24 అడుగుల లోతు భారీ గుంత తవ్వారని అన్నారు. స్కూల్ కట్టే పనైతే పగలు చేయొచ్చు కదా? అర్ధరాత్రి ఎందుకు తవ్వారు? గుప్త నిధుల వేటలో రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే ఈ కుట్ర జరిగింది అంటూ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలో ధరణిలో ఇది దేవాలయ భూమి గా ఉంటే.. కాంగ్రెస్ రాగానే భూభారతిలో రాత్రికి రాత్రే ప్రభుత్వ భూమిగా ఎలా మారింది? అని ప్రశ్నించారు. స్కూల్ కట్టడానికి చుట్టూ కావలసినంత స్థలం ఉందని.. అసలు ఈ నియోజకవర్గంలో వేరే చోట జీవో వచ్చిన స్కూల్ ను ఇక్కడికి ఎందుకు మార్చారు? అని మండిపడ్డారు. పురావస్తు శాఖ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, బాధ్యులను అరెస్ట్ చేసి మిషనరీని సీజ్ చేయాలన్నారు. యుద్ధప్రాతిపదికన ఈ చారిత్రక శివాలయాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అర్ధరాత్రి తవ్వకాల్లో బయటపడ్డ గుప్త నిధులు, లంక బిందెలు ఏ ప్రభుత్వ పెద్దల ఇళ్లకు పోయాయో సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. సీవీసీకి, విజిలెన్స్ కు సైతం ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>