కలం, వెబ్‌డెస్క్: ఈ రోజుల్లో చాలామంది మహిళలను వేధిస్తున్న ప్రధానమైన చర్మ సమస్యల్లో ముఖంపై అవాంఛిత రోమాలు (Facial Hair) రావడం ఒకటి. పెదవుల పైన, గడ్డం కింద వచ్చే ఈ నల్లటి వెంట్రుకల కారణంగా పబ్లిక్‌లోకి వెళ్లాలన్నా, ఎవరితోనైనా మాట్లాడాలన్నా చాలామంది తీవ్రమైన ఆత్మన్యూనతకు, ఇబ్బందికి గురవుతుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ హార్మోన్ & గట్ హెల్త్ కోచ్, డైటీషియన్ మన్‌ప్రీత్ కల్రా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో మహిళలకు ఒక చక్కని పరిష్కారాన్ని చూపించారు. అవేంటో తెలుసుకుందాం.
ప్రస్తుత జీవనశైలి కారణంగా చాలా మంది మహిళల్లో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. టీనేజ్ అమ్మాయిలు, మహిళలు కూడా.. హార్మోన్ల అసమతుల్యత కారణంగా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అందులో ఒకటి.. అవాంఛిత రోమాలు. పెదవుల పైన, గడ్డం మీద, గడ్డం కింద వెంట్రుకలు మొలుస్తుంటాయి. కొందరిలో ఈ గ్రోత్ చాలా ఎక్కువగానే ఉంటుంది. పురుషుల వలే చిన్న మీసాలు కనిపిస్తుంటాయి. ఈ సమస్య నుంచి తాత్కాలికంగా తప్పించుకోవడానికి.. కొందరు వ్యాక్సింగ్, షేవింగ్ చేసుకుంటూ ఉంటారు. మరికొందరు ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. మన డైట్‌లో హార్మోన్ల సమతుల్యతకు మద్దతు ఇచ్చే ఆహారం తీసుకుంటే అవాంఛిత రోమాలు వెనుక ఉన్న ప్రధాన ట్రిగ్గర్‌లలో ఒకదాన్ని తగ్గించవచ్చని సూచిస్తున్నారు నిపుణులు మన్‌ప్రీత్ కల్రా.
స్పియర్‌మింట్ టీ తాగండి
స్పియర్‌మింట్ టీ రోజూ రెండు కప్పులు తీసుకుంటే శరీరంలోని ఫ్రీ టెస్టోస్టెరాన్, ఆండ్రోజెన్ స్థాయిలు తగ్గుతాయి. ఈ రెండూ హార్మోన్ల స్థాయులు పెరిగితే ముఖంపై అవాంఛిత రోమాలు (Facial Hair) పెరిగుతాయి. ఈ హెర్బల్ టీ మీ హార్మోన్ల సమతుల్యతను ప్రోత్సహిస్తుందని మన్‌ప్రీత్ కల్రా అన్నారు.
సిట్రస్ పండ్లు తినండి
నిమ్మ, నారింజ, ద్రాక్షపండ్లు వంటి పండ్లలో సమృద్ధిగా ఉండే విటమిన్ సి శరీరంలో ఇనోసిటాల్ శోషణను పెంచుతుంది. ఇది ఇన్సులిన్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది, కాలక్రమేణా టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది. సిట్రస్ పండ్లను రోజూ మీ ఆహారంలో తీసుకుంటే.. హార్మోన్లు బ్యాలెన్స్ అవ్వడమే కాదు ఇమ్యూనిటీ పెరుగుతుంది, మీ చర్మం మిలమిల మెరుస్తుంది.
దాల్చిన చెక్క నీరు తాగండి
భోజనం చేసిన తర్వాత దాల్చిన చెక్క పొడి వేసిన నీరు తాగితే బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉంటుందట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ (Resistance) మెరుగ్గా ఉంటే ఆండ్రోజెన్ కంట్రోల్‌లో ఉంటుంది. ఇది క్రమక్రమంగా అవాంఛిత రోమాలు పెరగకుండా చేస్తుంది. దాల్చిన చెక్క నీళ్లు భోజనం తర్వాత తీసుకుంటే జీవక్రియ మెరుగుపడుతుందని మన్‌ప్రీత్ కల్రా అన్నారు.
గుమ్మడికాయ గింజలు తినండి
గుమ్మడికాయ గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడానికి కారణమయ్యే ఎంజైమ్‌లను అడ్డుకుంటుంది. గుమ్మడి గింజలు రోజూ తింటే హార్మోన్లు బ్యాలెన్స్‌గా ఉంటాయి. గుమ్మడి గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్ కూడా మెండుగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి తోడ్పడతాయి.
ఉడికించిన క్రూసిఫరస్ కూరగాయలు తినండి
బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి క్రూసిఫరస్ కూరగాయలు ఉండికించి తీసుకుంటే.. ఈస్ట్రోజెన్‌ను సమర్థవంతంగా జీవక్రియ చేసే శరీర సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది హార్మోన్ల సమతుల్యతను ప్రోత్సహిస్తుంది. చర్మం కాంతివంతంగా మారడంతో పాటు జుట్టు చక్కగా పెరుగుతుంది.
నానబెట్టిన మెంతులు తీసుకోండి
ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన మెంతులు తీసుకుంటే ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి, ఆండ్రోజెన్ స్థాయిలను తగ్గిస్తాయి. తద్వారా క్రమంగా అవాంఛిత రోమాలు తగ్గుముఖం పడతాయి.
పసుపు సహాయపడుతుంది
పసుపులో కర్కుమిన్ అనే యాక్టివ్ కాంపౌండ్ ఉంటుంది. ఇది శరీరంలోని ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. కర్కుమిన్ ఆండ్రోజెన్ కార్యకలాపాలను మాడ్యులేట్ చేయడంలో కూడా సహాయపడుతుంది. తద్వారా హార్మోన్ల సమతుల్యతకు సహాయపడుతుంది. రోజువారీ భోజనంలో చిటికెడు పసుపును జోడించండి.
Read Also: విమానంలో సాంకేతిక లోపం: శంషాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్!
Read Also: స్మార్ట్ ప్రెసిడెంట్స్!

