కలం, వెబ్‌డెస్క్: ఏపీ మెడికల్ కాలేజీల టెండర్ల అంశం ఏపీలో తీవ్ర వివాదాస్పదం విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) క్లారిటీ ఇచ్చారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఆలస్యం కాకుండా నిర్ణయాలు తీసుకోవాలని, అవసరమైతే బిడ్డర్లతో నేరుగా చర్చలు జరపాలని సూచించారు.
ప్రత్యేకంగా ఆదోని మెడికల్ కాలేజీ విషయంలో ముందుకు వచ్చిన సంస్థతో ఒప్పందం చేసుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu) స్పష్టం చేశారు. కాలేజీ నిర్మాణం ప్రారంభమయ్యేలా తక్షణమే కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలకు వైద్య విద్య, వైద్య సేవలు అందుబాటులోకి రావాలంటే మెడికల్ కాలేజీల నిర్మాణం అత్యంత కీలకమని చంద్రబాబు పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ఏర్పాటులో పబ్లిక్, ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానం దేశవ్యాప్తంగా అమల్లో ఉందని సీఎం గుర్తు చేశారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వంపై భారం తగ్గడంతో పాటు వేగంగా మౌలిక సదుపాయాలు కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలోనూ ఇదే విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.
టెండర్ల ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, నాణ్యతపై రాజీ పడవద్దని చంద్రబాబు స్పష్టం చేశారు. నిర్ణీత గడువుల్లో పనులు పూర్తి చేసేలా ఒప్పందాల్లో స్పష్టమైన నిబంధనలు ఉండాలని తెలిపారు. మెడికల్ కాలేజీల నిర్మాణం ఆలస్యం అయితే విద్యార్థులు, ప్రజలు నష్టపోతారని పేర్కొంటూ, ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


