కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి (Kamareddy) జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువులో విషాదం చోటు చేసుకుంది. సరంపల్లి గ్రామానికి చెందిన మత్స్యకార యువకుడు బోడదారి స్వామి (25) పెద్ద చెరువులో చేపలు పట్టేందుకు వలను విసిరాడు. ఈ క్రమంలో చెరువులో దిగగా.. తన వలలోనే చిక్కుకుని ఊపిరాడక మృతి చెందాడు. బుధవారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా.. గురువారం మృతదేహం బయటపడటంతో గ్రామస్థులు గమనించి, వెంటనే తండ్రికి సమాచారం అందించారు. ఇప్పటికే భార్య చనిపోయి పుట్టెడు బాధలో ఉన్న అతను, చేతికి అందివచ్చిన కుమారుడు అర్ధాంతరంగా చనిపోవడంతో గుండెలవిసేలా రోధించాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రి కి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

