కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ (Konda Surekha)ను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ సాధారణ పరిపాలన (పొలిటికల్-బి) శాఖ జీవో జారీ చేసింది.
ఆర్టికల్ 164(1) కింద ఉత్తర్వులు..
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1) ద్వారా గవర్నర్‌కు కల్పించిన అధికారాల మేరకు, ముఖ్యమంత్రి సలహాతో కొండా సురేఖ ఇకపై మంత్రిగా కొనసాగరని గవర్నర్ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మంత్రివర్గం నుంచి ఆమె తొలగింపు తక్షణమే అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
తెలంగాణ గెజిట్‌లో ప్రచురణ..
ఈ నిర్ణయానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను తెలంగాణ గెజిట్ ప్రత్యేక సంచికలో ప్రచురించాలని ప్రభుత్వం ఆదేశించింది. గెజిట్‌లో ప్రచురణ కోసం 500 ప్రతులను సాధారణ పరిపాలన శాఖకు అందించాలని ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ పర్చేజ్ విభాగానికి సూచించింది.
అధికారికంగా అన్ని శాఖలకు సమాచారం..
గవర్నర్ ఉత్తర్వులను ముఖ్యమంత్రి కార్యాలయం, అందరు మంత్రులు, తెలంగాణ సచివాలయంలోని శాఖలు, జిల్లా కలెక్టర్లు, ఎన్నికల సంఘం, లోకాయుక్త, హైకోర్టు రిజిస్ట్రార్ తదితర సంబంధిత అధికారులకు పంపించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
దీంతో కొండా సురేఖ మంత్రి పదవి నుంచి తొలగింపు ప్రక్రియ అధికారికంగా పూర్తయినట్లయింది. ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ జారీ చేసిన ఈ ఉత్తర్వులతో ఆమె మంత్రివర్గ సభ్యత్వం ముగిసింది.

