కలం, తెలంగాణ బ్యూరో : రాజకీయాల్లో చాలామంది నేతలకు ‘సన్ స్ట్రోక్’ తగిలిందంటూ వింటుంటాం. కుమారుల నిర్వాకానికి తండ్రుల రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారిన ఉదాహరణలను ప్రస్తావిస్తుంటారు. కానీ, ఇప్పుడు కొండా సురేఖకు మాత్రం ‘డాటర్ స్ట్రోక్’ తగిలింది. కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలతో సురేఖ (Konda Surekha) మంత్రి పదవి పోయింది. కుమార్తె వ్యాఖ్యలను ఖండించాలంటూ సొంత పార్టీ నేతల నుంచి ఒత్తిడి వచ్చినా దానికి సురేఖ ససేమిరా అన్నారు.
అంతేకాక, ఆమె జీవితం.. ఆమె ఇష్టం.. ఆమె స్వతంత్రురాలు.. ఆమె వ్యాఖ్యలను సమర్థించను.. ఖండించను.. ప్రశ్నించే అధికారం నాకు లేదు.. అంటూ సురేఖ రిప్లై ఇచ్చారు. కుమార్తె వ్యాఖ్యలను ఆ రోజే ఖండించి ఉంటే, వివాదాన్ని మరింత ముదరకుండా అప్పుడే పరిష్కారమయ్యేలా చొరవ తీసుకుని ఉంటే మంత్రి పదవి తీసేయాల్సిన పరిస్థితి వచ్చేదికాదన్న అభిప్రాయాలు కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. చివరకు ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో మాట్లాడిన తర్వాత కూడా బయటకు వచ్చి ముఖ్యమంత్రిపైనా మొదట చర్యలు తీసుకోవాలంటూ మీడియాతో చిట్ చాట్‌లో సురేఖ కామెంట్ చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
లండన్‌కు వెళ్లిన సుష్మిత
కొండా సురేఖపై కాంగ్రెస్ హైకమాండ్ యాక్షన్ తీసుకోడానికి ప్రధాన కారణం ఆమె కుమార్తె సుష్మిత (Konda Susmita) చేసిన వ్యాఖ్యలే. అటు కుమార్తెను మందలించలేక, ఇటు ఆమె కామెంట్లను సమర్థించుకోలేక తొలుత ఇబ్బంది పడినా చివరికి ఫ్యామిలీ ముఖ్యమని భావించిన కొండా సురేఖ తన కుమార్తె సుష్మితే ముఖ్యమని చెప్పారు.
కుమార్తె వ్యాఖ్యలతో వివాదం మొదలుకాగా అది మంత్రివర్గం నుంచి బర్తరఫ్ రూపంలో ముగిసే సమయానికి తల్లిని ఓదార్చడానికి సుష్మిత అందుబాటులో లేకుండా పోయారు. ప్రస్తుతం సుష్మిత లండన్‌లో ఉన్నట్లు మంత్రి సన్నిహితుల సమాచారం. గత నెల 19న సుష్మిత వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా రెండు వారాల తర్వాత సెప్టెంబర్ 3న సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించడంతో ఎండ్ కార్డు పడింది. సుష్మిత వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా ఉండపోయినా, లేదా కొండా సురేఖ ఆ వ్యాఖ్యలను ఖండించినా మంత్రిగా కొనసాగి ఉండేవారన్నది చాలామంది రాజకీయ నాయకుల అభిప్రాయం.
‘‘నా కూతురు చేసిన కామెంట్లను సమర్థించను.. వ్యతిరేకించను. ‘నిన్నగాక మొన్నొచ్చిన కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్యను ఎంపీనిచేసుకున్నడు. మీరు కనీసం నాకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించే పరిస్థితుల్లో లేరు. మీరొక చైర్మన్ పదవి తెచ్చుకునే పరిస్థితుల్లో లేరు. కాబట్టి నా ఆలోచన మేరకు నేను ముందుకు వెళ్తా’ అని నా కూతురు సుష్మిత అన్నది. ఆమె స్వతంత్రురాలు” అని మీడియా ముఖంగా సురేఖ వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి తండ్రి కొండా మురళికి చైర్మన్ పదవి, తనకు ఎమ్మెల్యే టికెట్ కోసం సుష్మిత ఒత్తిడితెచ్చినట్లు అర్థమవుతున్నదని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.

