కలం, వెబ్ డెస్క్ : అమెరికా, కెనడా, మెక్సికో వేదికగా వచ్చే నెల జూన్ 11 నుంచి ప్రారంభమయ్యే 2026 ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup) ప్రసారాలపై భారత్‌లో భారీ అనిశ్చితి నెలకొంది. 48 జట్లు, 104 మ్యాచ్‌లతో జరగనున్న ఈ మెగా టోర్నీకి ఇప్పటివరకు ఏ భారతీయ టీవీ ఛానెల్ లేదా ఓటీటీ సంస్థ ప్రసార హక్కులు దక్కించుకోలేదు. దీంతో కోట్లాది భారతీయ ఫుట్‌బాల్ అభిమానులు మ్యాచ్‌లను చూసే అవకాశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రసార హక్కుల ధరే ఈ వివాదానికి ప్రధాన కారణంగా మారింది. తొలుత ఫిఫా 2026, 2030 వరల్డ్ కప్‌ల హక్కుల కోసం 100 మిలియన్ డాలర్లు కోరగా, భారత్ నుంచి ఎవరూ బిడ్ వేయలేదు.
తర్వాత ధరను తగ్గించినా ఒప్పందం కుదరలేదు. జియో స్టార్ 20 మిలియన్ డాలర్ల ఆఫర్ ఇవ్వగా ఫిఫా తిరస్కరించింది. సోనీ కూడా ఈ డీల్‌కు దూరంగా నిలిచింది. అర్ధరాత్రి సమయంలో మ్యాచ్‌లు ఉండటంతో ప్రకటనల ఆదాయం తగ్గే అవకాశం, ఇప్పటికే క్రికెట్ హక్కులపై భారీ ఖర్చులు, డాలర్ మారకం విలువ పెరగడం వంటి అంశాలు కంపెనీలను వెనక్కి తగ్గిస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఫిఫా అధికారులు ఢిల్లీలో చర్చలు జరుపుతున్నారు. వరల్డ్ కప్ ప్రసారాలు లేకపోవడం ప్రజల సమాచార హక్కుకు విరుద్ధమంటూ ఢిల్లీ హైకోర్టులో కేసు కూడా నమోదైంది. అయితే ప్రసార భారతి, దూరదర్శన్ స్పోర్ట్స్ ఈ హక్కులు కొనుగోలు చేయబోమని స్పష్టం చేశాయి. టోర్నీ ప్రారంభానికి కేవలం మూడు వారాల సమయం మాత్రమే మిగిలి ఉండగా, భారత్‌లో ఇంకా ప్రసారాలపై స్పష్టత రాకపోవడం ఫుట్‌బాల్ అభిమానుల్లో ఆందోళన పెంచుతోంది.

