కలం, ఖమ్మం బ్యూరో: కొత్త ఆసరా పింఛన్లపై ఈ నెల 23న జరగనున్న క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) వెల్లడించారు. ప్రజల సంక్షేమంతోపాటు అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పొంగులేటి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ 14వ వార్డు పరిధిలోని తెల్దారుపల్లి నుంచి ఖమ్మం- కోదాడ రోడ్డు వరకు వయా రాముడు చెరువు మార్గంలో 4 కోట్ల 2 లక్షల వ్యయంతో చేపట్టనున్న 3.6 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్‌తో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు.
తెల్దారుపల్లి ప్రాంతంలో భారీగా అభివృద్ధి
తెల్దారుపల్లి ప్రాంతంలో ఇప్పటివరకు సుమారు 9 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినట్లు తెలిపారు. అలాగే రూ.4 కోట్ల 2 లక్షల వ్యయంతో 3.6 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణ పనులకు నేడు శ్రీకారం చుట్టినట్లు మంత్రి వివరించారు. ఈ రోడ్డు నిర్మాణంతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ నెల 23న జరగనున్న రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో కొత్త ఆసరా పెన్షన్లపై నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి వెల్లడించారు. అనంతరం లబ్ధిదారులకు ఇంటి స్థలం అప్పగింత పట్టా ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎదులాపురం మునిసిపల్ చైర్‌పర్సన్ అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్ ,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

