ఉపాధికి ‘హామీ’ స‌రే.. మ‌రి బతుకులకు భ‌రోసా?

కలం, ఖమ్మం బ్యూరో: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న “వీబీ జీ రామ్ జీ”(VB—G RAM G) పథకంలో, ఉపాధికి “హామీ” ఉంది కానీ తమ బతుకులకు భ‌రోసా లేదని… ఉపాధి హామీ పథకంలో కీలక పాత్ర పోషిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు (Field Assistants) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలలో నివసించే కూలీలకు వ్యవసాయ పనులు లేనప్పుడు, గ్యారంటీతో కూడిన ఉపాధి అందించాలనే సదుద్దేశంతో ప్రారంభించబడిన ఈ పథకం క్షేత్ర స్థాయిలో విజయవంతం కావడంలో ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర మరువలేనిది. ఎండనక, వాననక గ్రామాల్లోని కూలీలను సమన్వయం చేసుకుంటూ, పథకాన్ని ముందుకు నడిపిస్తుంటారనేది గ్రామాల్లో ఉండేవాళ్ల‌కు తెలిసిన విషయమే. అలాంటి వీళ్ల జీవితాల్లో మాత్రం అనేక కష్టాలు, కన్నీళ్లు ఉండటం గమనార్హం.

గ్రామాల్లో ఉపాధి పనులు మొదలయ్యాయంటే చాలు, సూర్యోదయానికి ముందే ఫీల్డ్ అసిస్టెంట్ల అడుగులు పొలాల గట్ల వైపు పడుతుంటాయి. అలాగే వేల సంఖ్యలో కూలీలకు పని కల్పించడం, మస్టర్లు నమోదు చేయడం, కొలతలు తీయడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఉపాధి హామీ పథకంలో ప్రతి అడుగులో వారి శ్రమ కనిపిస్తుందనేది జగమెరిగిన సత్యం. అయితే ఆ శ్రమకు తగిన గుర్తింపు, భద్రత మాత్రం లభించడం లేదంటూ ఫీల్డ్ అసిస్టెంట్లు అసంతృప్తితో జీవిస్తున్నారు.

​ఫీల్డ్ అసిస్టెంట్ల (Field Assistants) ప్రధాన డిమాండ్ ఉద్యోగ భద్రత. ఏ చిన్న పొరపాటు జరిగినా లేదా రాజకీయ ఒత్తిళ్లు పెరిగినా తక్షణమే విధుల నుంచి తొలగించబడతామనే భయం వారిని నీడలా వెంటాడుతోంది. ఏళ్ల తరబడి పని చేస్తున్నా, తమను క్రమబద్ధీకరించడం లేదనే ఆవేదన వారిలో గూడుకట్టుకుంది. దీంతో పాటు పెరిగిన పని భారం,
​ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇచ్చే గౌరవ వేతనం వారి కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోకపోవడంతో వారు కడు పేదరికంలో జీవిస్తున్నారు. అలాగే వీరికి విపరీతమైన పని ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కేవలం ఉపాధి పనులే కాకుండా, సర్వేలు, సంక్షేమ పథకాల బాధ్యతలను కూడా వీరికే అప్పగిస్తుంటారు. ఇక గ్రామ గ్రామాన తిరగడానికి అయ్యే పెట్రోల్ ఖర్చులు కూడా సొంత జేబు నుంచే పెట్టుకోవాల్సిన పరిస్థితి.

​ఫీల్డ్ అసిస్టెంట్లు కత్తి మీద సాము చేస్తున్నారు. ఒకవైపు ఉన్నతాధికారుల టార్గెట్లు, మరోవైపు గ్రామస్థుల డిమాండ్లతో పాటు ఎన్.ఎం.ఎం.ఎస్ యాప్‌లో హాజరు నమోదు చేసేటప్పుడు సిగ్నల్ సమస్యలు వస్తే, కూలీలకు వేతనాలు పడవు. దీనికి ఫీల్డ్ అసిస్టెంట్లనే బాధ్యులను చేస్తూ కూలీలు గొడవకు దిగుతుంటారు. వడగాల్పులు సైతం లెక్కచేయకుండా పని చేయాల్సి రావడంతో చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. వీరికి ఎటువంటి ఆరోగ్య బీమా సౌకర్యం లేకపోవడం విచారకరం.

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 7 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉండగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు ఏడు వందల మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, వెయ్యి పైగా గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్నారు. కాగా వీరి నెల వేతనం 20 ఏళ్ల నుంచి పది వేల రూపాయలే వుండటం గమనార్హం. ​గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను ప్రభుత్వం మానవీయ కోణంలో చూడాలని, ​కనీస వేతనం పెంపు,
​ఉద్యోగ భద్రత, ​ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని వేడుకొంటున్నారు. అప్పుడే “ఉపాధి హామీ” అనేది దాన్ని నమ్ముకున్న ఫీల్డ్ అసిస్టెంట్ల జీవితాల్లో కూడా వెలుగులు నింపుతుందని, కావున ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ల సంక్షేమాన్ని విస్మరిస్తే, ఉపాధి హామీ పథకం లక్ష్యాన్ని చేరడం కష్టమవుతుందని పలువురు సానుభూతిపరులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అందరికీ పని కల్పించే, మా పిల్లల భవిష్యత్తుకు గ్యారెంటీ లేదు. చనిపోయిన ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలకు ఎటువంటి ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం అందించడం లేదు. కనీసం మా పిల్లలకు కారుణ్య నియామకాలు కూడా చేపట్టడం లేదు. ఈఎస్ఐ, పీఎఫ్ లాంటి కనీస సదుపాయాలు కూడా లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము.
– జీ.రాములు, జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ సంఘం అధ్యక్షుడు

Read Also: మళ్లీ పుట్టిన ‘టీఆర్ఎస్’.. పేరు, జెండా వెనుక కవిత స్ట్రాటజీ ఏంటి?

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>