కలం, వెబ్డెస్క్ : యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్యపై ఉన్న కోపంతో ఓ తండ్రి తన రెండేళ్ల కూతురిని కిరాతకంగా చంపడమే కాకుండా, తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సంస్థాన్ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెంలో నివసిస్తున్న రవి, స్వాతి దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మూడు నెలల క్రితం భార్య స్వాతి తన తొమ్మిది నెలల చిన్న కూతురు మయూరిని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. పెద్ద కూతురు మేఘన (2) తండ్రి రవి వద్దే ఉంటోంది.
అయితే, తన పెద్ద కూతురిని కూడా తన వద్దకే పంపించాలని స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. ఈ వివాదంతో తన పరువు పోయిందని భావించిన రవి, తన కూతురు తనకు దూరం అవుతుందనే ఆవేదనతో ఘాతుకానికి ఒడిగట్టాడు. సపోటా పండులో ఎలుకల మందు కలిపి చిన్నారి మేఘనకు తినిపించి, ఆపై తాను కూడా విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు.
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వారిద్దరినీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రెండేళ్ల మేఘన ప్రాణాలు విడిచింది. ప్రస్తుతం రవి పరిస్థితి విషమంగా ఉంది. భార్య స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
Read Also: పెట్రోల్, గ్యాస్, యూరియా నిల్వలపై నేడు సీఎం సమీక్ష
Follow Us On : WhatsApp

