‘బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌‌‌’పై ట్రంప్ కీలక నిర్ణయం.. అమెరికా పౌరసత్వానికి కొత్త ఆంక్షలు

కలం, వెబ్ డెస్క్: పుట్టుకతో వచ్చే అమెరికా పౌరసత్వంపై (బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌) (Birthright Citizenship) హక్కులను పరిమితం చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేవలం పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో ప్రసవాలకు అమెరికాకు వచ్చే ‘బర్త్ టూరిజం’ను అడ్డుకోవడంతో పాటు, బర్త్ రైట్ సిటిజన్‌షిప్ పరిధిని కుదిస్తూ గురువారం రెండు కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు. ట్రంప్ గతంలో ఇచ్చిన ఇటువంటి ఆదేశాలను యూఎస్ సుప్రీంకోర్టు కొట్టివేసిన కొన్ని వారాల వ్యవధిలోనే మళ్లీ ఈ కొత్త ఉత్తర్వులు రావడం గమనార్హం.

అమెరికా టెరిటరీలకు కూడా..

ఈ కొత్త నిబంధనల ప్రకారం.. పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో డబ్బులు చెల్లించి గర్భిణులను అమెరికాకు తీసుకువచ్చే బర్త్ టూరిజం ఏజెన్సీలకు ఈ ఆర్డర్ ద్వారా అడ్డుకట్ట పడనుంది. ఉగ్రవాద సంస్థలకు చెందిన వారి పిల్లలు, విదేశీ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, విదేశీ ప్రభుత్వాల తరఫున అమెరికాలో లాబీయింగ్ చేసే విదేశీ పౌరుల పిల్లలకు పుట్టుకతో వచ్చే పౌరసత్వ అర్హతను రద్దు చేశారు. వీటితో పాటు ఫెడరల్ చట్టం ప్రకారం పుట్టుకతో పౌరసత్వం వర్తించని అమెరికా పరిధిలోని టెరిటరీలకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి.

గ్రీన్ కార్డుకు సవాల్

సాధారణంగా ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడిన భారతీయ ఐటీ నిపుణుల పిల్లలకు పుట్టుకతోనే యూఎస్ పౌరసత్వం (గ్రీన్ కార్డ్ లేదా సిటిజన్‌షిప్) లభించేది. ట్రంప్ తీసుకొచ్చిన ఈ కొత్త పరిమితుల వల్ల తాత్కాలిక వీసా హోదా కలిగిన విదేశీయుల పిల్లలకు జన్మతః వచ్చే పౌరసత్వ అర్హత ముగిసిపోయే ప్రమాదం ఉంది. గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న భారతీయ కుటుంబాలకు ఈ నిర్ణయం గట్టి ఎదురుదెబ్బగా మారడమే కాకుండా, వారి పిల్లల చదువు, ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్ చట్టపరమైన హక్కులపై ప్రభావం ఉంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

న్యాయవివాదాలు తప్పవా?

ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర న్యాయవివాదాలకు దారితీసేలా కనిపిస్తున్నది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం అక్కడ జన్మించే ప్రతి ఒక్కరికీ (తల్లిదండ్రుల వీసా హోదాతో సంబంధం లేకుండా) పౌరసత్వం లభిస్తుందని వలసల నిపుణులు, అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ స్పష్టం చేస్తున్నాయి. కొత్త ఉత్తర్వులు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, ఇవి కూడా గతంలోలాగే న్యాయస్థానాల ముందు నిలబడలేవని నిపుణులు చెప్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>