కలం, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసు (NEET Paper Leak)లో సీబీఐ 94 పేజీల చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ వ్యవహారంలో ఎన్ టీఏ నిపుణులే కీలక సూత్రధారులను తేలింది. ఎన్టీఏలోని భద్రతా లోపాలను ఆసరాగా చేసుకొని సబ్జెక్ట్ నిపుణులు, మధ్యవర్తులు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ముఠాగా ఏర్పడి ఈ వ్యవహారం నడిపినట్టు సీబీఐ ఆరోపించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక సీబీఐ కోర్టులో దాఖలు చేసిన చార్జ్ షీట్ లో13 మందిని నిందితులుగా చేర్చింది.
లీక్ ఎలా జరిగింది?
ప్రశ్నాపత్రం బయటకు రావడానికి హ్యాకింగ్ లేదా డిజిటల్ చోరీ కారణం కాదని సీబీఐ తన చార్జ్ షీట్ లో తెలిపింది. ఎన్టీఏ ప్రశ్నాపత్రాల తయారీ, అనువాదం, బ్యాక్ ట్రాన్స్లేషన్ ప్రక్రియలో పాల్గొన్న నిపుణులే సూత్రదారులను తేల్చింది. ‘ప్రశ్నపత్రాల తయారీ సమయంలో నిపుణులకు వివిధ విభాగాల్లోకి ప్రవేశం ఉండేది. లోపలికి వెళ్లేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసే వ్యవస్థ లేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న నిందితులు చిన్న చీటీలపై సంక్షిప్తంగా ప్రశ్నలు రాసుకున్నారు. సంబంధిత పాఠ్యపుస్తకాల్లో ప్రశ్నలకు సంబంధించిన పేరాలను గుర్తించారు.’ అంటూ సీబీఐ చార్జ్ షీట్ లో పేర్కొన్నది.
వీరిదే కీలక పాత్ర
‘ఎన్టీఏ ప్యానెల్‌లోని పీవీ కులకర్ణి (కెమిస్ట్రీ), మనీషా గురునాథ్ మండారే (జువాలజీ, బోటనీ), మనీషా సంజయ్ హవల్దార్ (ఫిజిక్స్) ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీలోని ఎన్టీఏ కార్యాలయంలో ప్రశ్నపత్రాల తయారీ పూర్తయ్యాక వీరు హోటల్ గదులకు వెళ్లి ఆ ప్రశ్నలను తమకు జ్ఞాపకం ఉన్నంత వరకు తిరిగి రాశారు. కులకర్ణి చిన్న చీటీలపై సంక్షిప్త ప్రశ్నలు, సమాధానాలు రాసుకుని భద్రతా ప్రాంతం నుంచి బయటకు తీసుకెళ్లేవాడు. సులభమైన ప్రశ్నలను గుర్తుంచుకొని తర్వాత పూర్తి రూపంలో దాన్ని తయారు చేసేవాడు. హవల్దార్, వాఘ్మారే కూడా ప్రశ్నలను తిరిగి రాసి తమ సబ్జెక్ట్ పుస్తకాలలో వాటిని మార్క్ చేశారు’ అంటూ సీబీఐ చార్జ్ షీట్లో పేర్కొన్నది.
కులకర్ణి పాత్ర ఇదే..
కులకర్ణి నీట్-యూజీ 2026లో మూడు ప్రశ్నపత్రాల సెట్లకు బ్యాక్ ట్రాన్స్లేషన్ చేశాడని సీబీఐ వెల్లడించింది. మూడురోజుల్లో సుమారు 135 ప్రశ్నల అనువాద ప్రక్రియలో పాల్గొన్నట్లు పేర్కొంది. అందువల్ల అతడికి అందుబాటులో ఉన్న సెట్లలోని కెమిస్ట్రీ ప్రశ్నలతో స్వాధీనం చేసుకున్న లీక్ మెటీరియల్ దాదాపుగా సరిపోలిందని తెలిపింది.
విద్యార్థులకు కోచింగ్
ఈ కుట్రలో మధ్యవర్తి మనీషా సంజయ్ వాఘ్మారే కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ పేర్కొంది. ఆమె రాజస్థాన్, హర్యానా తదితర రాష్ట్రాల అభ్యర్థులను పుణేలో నిర్వహించిన ప్రత్యేక కోచింగ్ తరగతులకు పంపించింది. కులకర్ణి, మండారే విద్యార్థులకు ప్రశ్నలను డిక్టేట్ చేయగా, వారు రాసుకున్న నోట్‌బుక్‌లను వాఘ్మారే సేకరించింది. వాటిలో కొన్ని ప్రశ్నలను ‘ఇంపార్టెంట్’, ‘వెరీ ఇంపార్టెంట్’గా గుర్తించినట్లు దర్యాప్తులో తేలింది. మండారే సూచనల మేరకు హవల్దార్ ఒక అభ్యర్థి తల్లికి 16 పేజీల ఫిజిక్స్ మెటీరియల్‌లో 68 ప్రశ్నలను అందించినట్లు కూడా ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.
డిజిటల్ ఆధారాలతో సీబీఐ దర్యాప్తు
పుణేలో కులకర్ణి నివసించే గేటెడ్ కమ్యూనిటీలో ఉపయోగించే యాక్సెస్ కంట్రోల్ యాప్ నుంచి సీబీఐ బయోమెట్రిక్, విజిటర్ రికార్డులను సేకరించింది. పరీక్షకు ముందు ఏప్రిల్‌లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కులకర్ణి నివాసానికి వచ్చినట్లు ఈ రికార్డుల్లో గుర్తించింది. అనంతరం కాల్ డేటా రికార్డులు, మొబైల్ ఫోన్ లొకేషన్ వివరాలతో వాటిని ధ్రువీకరించింది.
85 శాతం వరకు ప్రశ్నల సరిపోలిక
స్వాధీనం చేసుకున్న ప్రశ్నల మెటీరియల్‌ను ఢిల్లీ యూనివర్సిటీ నిపుణుల కమిటీ పరిశీలించింది. వాటిని నీట్-యూజీ 2026లోని కైలాస్, శివాలిక్, సెట్-2, సెట్-3 ప్రశ్నపత్రాలతో పోల్చగా, నిందితులకు అందుబాటులో ఉన్న సెట్లతో 85 శాతం వరకు ప్రశ్నలు సరిపోయినట్లు తేలింది. అందుబాటులో లేని సెట్లతో మాత్రం అత్యల్ప సరిపోలిక నమోదైంది.
జ్ఞాపకశక్తితోనే..
ఈ కుట్రలో డిజిటల్ కమ్యూనికేషన్‌ను వీలైనంత దూరంగా ఉన్న నిందితులు.. ప్రశ్నలను జ్ఞాపకం పెట్టుకోవడం, చేతిరాతతో నోట్స్ తయారు చేయడం, పుస్తకాల్లో గుర్తులు పెట్టడం వంటి పద్ధతులను నిందితులు అనుసరించినట్లు సీబీఐ తెలిపింది. దీంతో ఎలక్ట్రానిక్ ఆధారాలు మిగలకుండా చూసే ప్రయత్నం చేశారని పేర్కొంది.
కోచింగ్ సెంటర్ల సక్సెస్ రేటు పెంచడమే లక్ష్యం
కోచింగ్ సెంటర్ల సక్సెస్ రేట్ పెంచడం, భారీ మొత్తంలో డబ్బు సంపాదించడమే ఈ కుట్ర వెనుక ప్రధాన ఉద్దేశమని సీబీఐ ఆరోపించింది. ఈ కేసులో కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు శివరాజ్ రఘునాథ్ ముత్గావ్కర్ సహా మొత్తం 13 మందిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. నీట్-యూజీ 2026 పేపర్ లీక్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. చివరకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది.

