కలం, నిజామాబాద్ బ్యూరో: కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు నిరసనకు (Farmers Protest) దిగారు. నిజామాబాద్ (Nizamabad) జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూరు క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారి 63 (నిజామాబాద్ – కరీంనగర్ రోడ్డు) పై వారు బైఠాయించారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రైతులతో కలిసి పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బంది కలిగిస్తున్న యాప్ విధానాన్ని వీడాలని, సీజన్‌కు సరిపడా ఎరువులను తక్షణమే అందజేయాలని వారు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు, రైతుల రాస్తారోకోతో నిజామాబాద్ – కరీంనగర్ ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారు.

