జూరాలకు పెరుగుతున్న వరద ఉధృతి

కలం, జోగులాంబ గద్వాల : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు(Jurala Project ) కు వరద ప్రవాహం భారీగా పెరిగింది. సోమవారం సాయంత్రానికి జలాశయంలోకి 1.79 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. కర్ణాటక ప్రాజెక్టుల నుంచి కూడా దిగువకు నీటి విడుదల పెరిగింది. ఆలమట్టి జలాశయంలోకి 1.36 లక్షలు వస్తుండగా, దిగువకు 1.46 లక్షలు, నారాయణ్‌పూర్‌లోకి 1.40 లక్షలు వస్తుండగా దిగువకు 1.35 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. దీంతో పాటు భీమా నది నుంచి 65వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువలు విడుదల చేశారు.

జూరాలకు ఎగువన ఆల్మటి జలాశయంలో 123.081 టీఎంసీలకు గాను 111.644 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, దిగువన ఉన్న నారాయణపూర్‌ జలాశయంలో 33.313 టీఎంసీలకు గాను 29.23 టీఎంసీల నీరు ఉంది. కర్ణాటక జలాశయాల నుంచి జూరాలకు భారీగా వరద వస్తుండటంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 27 గేట్లు ఎత్తి దిగువకు‌ నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారం సాయంత్రానికి జూరాలకు 1.79 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 1.77 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తున్నది. జూరాల 27 గేట్లు ఎత్తి దిగువకు 1,39,185 క్యూసెక్కులు, విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 32,197 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్ట్‌కు 750 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్‌కు 1300 క్యూసెక్కులు, కోయిల్‌ సాగర్‌ ఎత్తిపోతలకు 630 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. ఇక జూరాల ప్రాజెక్టు మొత్తం నీటిమట్టం 318.51 మీటర్లు కాగా ప్రస్తుతం 317.75 మీటర్లు ఉన్నది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలకు గాను ఇప్పుడు 8.126 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>