కలం, నల్లగొండ బ్యూరో: ప్రభుత్వ రికార్డుల్లో ఆ కాలువ పారుతోంది.. కానీ రైతుల పొలాల్లో మాత్రం నెర్రెలు బారుతున్నాయి. పదేండ్ల నిరీక్షణ.. పందొమ్మిది కోట్ల ప్రజాధనం.. పదుల సంఖ్యలో సర్కారీ ఉత్తర్వులు.. ఇవన్నీ ఉన్నా గుర్రంపోడు (Gurrampode) మండల రైతులకు మిగిలింది మాత్రం ఎండిపోయిన కాలువ గట్టే. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుందన్న ఆశ ‘అక్కంపల్లి’ అంచునే ఆగిపోతుంటే.. సాగునీటి కోసం అన్నదాతలు చేస్తున్న ఆర్తనాదం వర్ణనాతీతం. పెద్దవూర మండలంలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (ఏకేబీఆర్) నుంచి గుర్రంపోడు మండలానికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన 7బీ డిస్ట్రిబ్యూటరీ (హైలెవల్ కెనాల్) పనులు ముందుకు సాగడం లేదు. కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించినా.. చుక్క నీరు రాక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
ఎన్నాళ్లీ నిరీక్షణ
ఈ ప్రాజెక్టు కథ 2008లో మొదలైంది. దాదాపు రూ.19 కోట్ల అంచనా వ్యయంతో 18 కిలోమీటర్ల మేర కాలువ తవ్వకానికి అప్పట్లో నిధులు మంజూరయ్యాయి. 2018లో అట్టహాసంగా నీటిని విడుదల చేసినా.. అది కేవలం ఆరంభ శూరత్వానికే పరిమితమైంది. నేటికీ చివరి భూములకు సాగునీరు అందకపోవడం గమనార్హం. మిగతా కాల్వలకు భిన్నంగా ఈ 7బీ డిస్ట్రిబ్యూటరీని సుమారు 9 నుంచి 12 మీటర్ల లోతున తవ్వాల్సి వచ్చింది. ఇంత లోతుగా తవ్వడం వల్ల నీరు గ్రావిటీ ద్వారా ప్రవహించి పొలాలకు చేరడం కష్టతరంగా మారింది. కేవలం వర్షపు నీరు లేదా భూగర్భ జలాలు ఊటలా చేరడం తప్ప.. కృష్ణమ్మ జలాలు నేరుగా పంటపొలాల్లో పారడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
నిలిచిపోయిన మరో 3 కిలోమీటర్ల పనులు
మైలాపురం నుంచి తానేదార్‌పల్లి వరకు తవ్వకం పూర్తయినా.. అక్కడి నుంచి తేనపల్లి చెరువు వరకు తవ్వాల్సిన మరో 3 కిలోమీటర్ల పని ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. దీంతో దాదాపు 3వేల ఎకరాల ఆయకట్టు ఎండిపోతోంది. గతంలో మిగిలిన రూ.5 కోట్ల నిధులు ఉన్నప్పటికీ పనులు ముందుకు సాగకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తోంది. సాగునీరు పక్కన పెడితే.. కనీసం ఈ కాలువ ద్వారా గ్రామాల్లోని చెరువులనైనా నింపండి అంటూ రైతాంగం వేడుకుంటోంది. చెరువులు నిండితే భూగర్భ జలాలు పెరిగి బోరు బావుల ద్వారా అయినా వ్యవసాయం చేసుకుంటామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.కోట్లు ఖర్చు పెట్టి తవ్విన కాలువ వల్ల ప్రయోజనం లేకపోతే అది కేవలం రాళ్లకుప్పగానే మిగిలిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే.. ఏకేబీఆర్ వద్ద గ్రావిటీ లెవల్‌లో సమస్య ఉండటం వల్ల నీరు 10 కిలోమీటర్ల వరకు మాత్రమే ప్రవహిస్తోంది. దీనికి పరిష్కారంగా ఏకేబీఆర్ వద్ద మోటార్లను ఏర్పాటు చేసి ప్రెజర్‌తో నీటిని లిఫ్ట్ చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉందని అధికారులు చెబుతున్నారు.
ఏదీఏమైనప్పటికీ గుర్రంపోడు (Gurrampode) మండల రైతుల కష్టాలు తీరాలంటే కేవలం ప్రతిపాదనలు సరిపోవు. యుద్ధ ప్రాతిపదికన మిగిలిన 3 కిలోమీటర్ల పనులు పూర్తి చేయాలి. అలాగే అధికారుల చెబుతున్నట్లుగా మోటార్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసి.. చివరి ఎకరా వరకు నీరు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అప్పుడే ఈ హైలెవల్ కెనాల్ ఆ ప్రాంత రైతులకు వరప్రదాయినిగా మారుతుంది. లేకుంటే భూములు బీళ్లుగానే మిగిలే పరిస్థితి లేకపోలేదు.
Read Also: ఖానాపూర్ మున్సిపల్ పీఠం బీజేపీ కైవసం
Follow Us On: Instagram

