కలం, వెబ్ డెస్క్ : 116 ఏళ్ల వయసులో తిరుమల (Tirumala) మెట్ల మార్గం ద్వారా కాలినడకన శ్రీవారిని దర్శించేందుకు వెళ్లిన నవనీతమ్మ (Navaneethamma) భక్తి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు వెంటనే స్పందించారు.
నవనీతమ్మను గుర్తించిన టీటీడీ అధికారులు ఆమెకు ప్రత్యేకంగా శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించి సత్కరించారు. ఆమె చూపిన అచంచల భక్తిని అభినందిస్తూ శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక దర్శనానికి ఏర్పాట్లు చేశారు. 116 ఏళ్ల వయసులోనూ తిరుమల మెట్ల మార్గాన్ని అధిరోహించి స్వామివారిని దర్శించాలనే ఆమె సంకల్పం పలువురిని భావోద్వేగానికి గురి చేసింది. టీటీడీ చేసిన ఈ ప్రత్యేక ఏర్పాట్లపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ, భక్తిని గౌరవించిన దేవస్థానం చర్యను అభినందిస్తున్నారు.

