కలం, వెబ్ డెస్క్: సింగరేణిని కాపాడుకునేందుకు మరో ఉద్యమానికి సిద్ధమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆదివారం సేవ్ సింగరేణి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై మండిపడ్డారు. డిపెండెంట్ కార్మికుల నియామకాలపై విజిలెన్స్, ఏసీబీ విచారణ చేస్తామని భట్టి విక్రమార్క అనడం విడ్డూరంగా ఉందన్నారు. కార్మికుల నియామకాలపై కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రం లోనైనా సహజ వనరులను అక్కడి ప్రజలకు ఉపయోగపడే విధంగా వాడేందుకు ప్రయత్నం చేస్తారని చెప్పారు.
కాలే కడుపుతో బొగ్గు తీసుకొచ్చే వాళ్లే కార్మికులు
ప్రకృతి మనకు బొగ్గు వరంగా ఇచ్చిందని.. దీన్ని ప్రజలకు మేలు చేసే విధంగా వాడేలా ప్రభుత్వం ఉండాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండేవో.. ఇప్పుడు అలాగే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఒకప్పుడు మన తెలంగాణ వాళ్లు దుబాయి, బొంబాయి, బొగ్గు బాయి అంటూ వెళ్లేవారని గుర్తు చేశారు. మనకు తినటానికి తిండి లేని సమయంలో కార్మికులకు తిండి పెట్టిన సింగరేణిని మనం సిరులవేణి అని తలుచుకుంటామని తెలిపారు. కానీ, ఇప్పుడున్న ప్రభుత్వానికి సింగరేణితో ఎలాంటి భావోద్వేగం లేదని.. అందుకే కార్మికుల సమస్యలు వారికి తెలియటం లేదన్నారు. సింగరేణిలో నుంచి బొగ్గు తీసేందుకు కార్మికులు (Singareni Workers) ప్రాణాలను ఫణంగా పెడుతున్నారని చెప్పారు. అక్కడి గాలి పీల్చుకుంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్లి బ్లాక్ అవుతుందని.. కాళ్లు వంకర అయ్యే పరిస్థితి ఉంటుందన్నారు. కాలే కడుపుతో వెళ్లి కాలిపోయే బొగ్గు తీసుకొచ్చే వాళ్లు మన కార్మికులు అని కవిత (Kavitha) కొనియారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో నష్టపోయాం..
తెలంగాణ సాధించుకున్న తర్వాత మనం కొంతమందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చుకున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో నష్టపోయామని.. అందుకే కొన్ని సడలింపులు ఇచ్చుకొని 20 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చుకున్నామని గుర్తు చేశారు. ఇప్పుడు వాళ్ల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కన్ను పడిందన్నారు. ఈ ఉద్యోగాలు ఎలా ఇచ్చారన్న దానిపై ఎంక్వైయిరీ వేస్తారంట అంటూ దుయ్యబట్టారు. వాళ్లకు ఉద్యోగాలు ఎందుకు ఇచ్చామన్న కారణం డిప్యూటీ సీఎం భట్టి తెలుసుకోవటం లేదన్నారు. సింగరేణి తో పెట్టుకున్న ఏ నాయకుడు కూడా బాగుపడలేదన్నారు. సింగరేణి కార్మికులతో పెట్టుకోవద్దని భట్టిని (Bhatti Vikramarka) తాను హెచ్చరిస్తున్నట్లు కవిత (Kavitha) తెలిపారు.
దీనిపై ఎంక్వైయిరీ వేయండి..
ఓబీ కాంట్రాక్టులు, డీజిల్ కుంభకోణాలు, కరెప్ట్ నాయకులు, అధికారుల మీద ముందు ఎంక్వైయిరీ వేయాలని డిమాండ్ చేశారు. కష్టపడి చెమటోడ్చే కార్మికుల మీద ఎంక్వైయిరీలు వేయటం ఏంటీ? అని ప్రశ్నించారు. సింగరేణి కార్మికుల మీద అసెంబ్లీలో భట్టి మాట్లాడిన మాటలు విన్నాక చాలా బాధ అనిపించిందన్నారు. ఆయన కార్మికుల గురించి మాట్లాడిన అంశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. డీజిల్ కుంభకోణం ద్వారా 250 కోట్లు, నిబంధనల ఉల్లంఘన కారణంగా 74 కోట్లు, లీకేజీల కారణంగా 24 కోట్లు, అదనపు వసూళ్లు చేయలేక 1,078 కోట్లు సంస్థకు నష్టం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రిపోర్ట్ ని కాగ్ చెబుతోందని, ముందు దీనిపై ఎంక్వైయిరీ వేయాలన్నారు.
ఆ సంస్థను ఎందుకు పార్ట్‌నర్‌గా చేశారు?
కిషన్ రెడ్డి (Kishan Reddy) వెళ్లి మాట్లాడగానే సంస్థలో బొగ్గు ప్రొడక్షన్ మారుతుందని.. చెమట చిందించి లాభాలు తెస్తున్న కార్మికులకు లాభాల్లో వాటా ఇస్తే అభ్యంతరం ఏంటీ? అని ప్రశ్నించారు. స్వయం ప్రతిపత్తి కలిగిన సింగరేణికి ప్రభుత్వం పెట్టే రూల్స్ వర్తించవన్నారు. బొగ్గు, కరెంట్ బకాయిలు కలిపి సింగరేణికి ఈ ప్రభుత్వం రూ.47 వేల కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. వాటిని చెల్లించకపోవటంతో కార్మికుల సేప్టీకి, వారి జీతాలకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. లిథియం రిఫైనరీ కోసం అల్ట్ మిన్ అనే చిన్న సంస్థతో సింగరేణి 2250 కోట్ల ఒప్పందం చేసుకుందని చెప్పారు. ఈ సంస్థను 2023 లో ఏర్పాటు చేశారని.. ఆ సంస్థ మొత్తం ఆదాయం రూ. 27 లక్షలు మాత్రమేనన్నారు. అలాంటి చిన్న కంపెనీతో సింగరేణి 2250 కోట్ల ఒప్పందం ఎలా చేసుకుంటుంది? అని ప్రశ్నించారు. సింగరేణి విషయంలో సిన్సియార్ ఉంటే ముందు ఈ ఒప్పందాల విషయం చెప్పాలన్నారు. అల్ట్ మిన్ కంపెనీ విషయంలో బ్యాంక్ గ్యారంటీలు ఎవరివీ? సింగరేణి వాటా ఎంత? ఆ సంస్థను ఎందుకు పార్ట్‌నర్‌గా చేశారు? అని నిలదీశారు.
మరో తెలంగాణ ఉద్యమం చేస్తాం..
‘రాజస్థాన్ తో 11 వేల కోట్ల ఒప్పందంలో సింగరేణి వాటా 72 వేల కోట్లు అంటున్నారు. ఒక మెగావాట్ ఉత్పత్తికి అయ్యే దాని కన్నా మూడు రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. అవుట్ రైట్ గా ఈ ఒప్పందంలో అవినీతి జరిగింది. దీనిపై మేము లెటర్ రాస్తాం. ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న వారి పేర్లు, అవినీతి బయట పెట్టాలి. మెడికల్ బోర్డు ను పాత పద్దతిలో నిర్వహించాలి. గతంలో మెడికల్ బోర్డు పెట్టి మళ్లీ నిర్వహించటం లేదు. విజిలెన్స్ కేసుల విచారణను పూర్తి చేయాలి. ఇన్ కం ట్యాక్స్ సింగరేణి కార్మికులు ఉద్యోగులకు ఉండొద్దు. దీనిపై నేను పార్లమెంట్ లో 2015 లోనే మాట్లాడాను. ఇన్ కం ట్యాక్స్ మినహాయింపులు ఇస్తే 12 వేల నుంచి 80 వేల వరకు ఉద్యోగులకు, కార్మికులకు మేలు జరుగుతుంది. ఇది లైఫ్ రిస్క్ సెక్టార్ కావటంతోనే ఇన్ కం ట్యాక్స్ మినహాయింపు అడుగుతున్నాం. వైద్య పరీక్షల్లో పాసైన 350 మంది అభ్యర్థులకు పోస్టులు ఇవ్వాలి. ఖాళీగా ఉన్న క్లర్క్ పోస్టులను నింపాలి. సంస్థకు ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలి. అలియాస్ పేర్ల విషయంలో గతంలో ఉన్న విధంగానే నిబంధనలు ఉండాలి. హెల్త్ విషయంలో నిమ్స్ రేట్లను కాకుండా కేంద్రానికి సంబంధించి సీజీహెచ్ఎంస్ రేట్లు అప్లయ్ చేయాలి. సింగరేణి విముక్తి కోసం అవసరమైతే మరో తెలంగాణ ఉద్యమం మాదిరి ఉద్యమం చేస్తాం. హెచ్ఎంఎస్ చేసే ఉద్యమానికి జాగృతి తరఫున పూర్తి మద్దతు తెలుపుతున్నా’ కవిత (Kavitha)అని అన్నారు.
Read Also: కాంగ్రెస్ ప్రభుత్వం భూ కుంభకోణాలకు పాల్పడుతోంది: హరీశ్ రావు
Follow Us On: X(Twitter)

