కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగిలిగొండ (Nagiligonda) గ్రామంలో శనివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ గ్రామ చెరువులో మునిగి చాట్ల పరంజ్యోతి (50) అనే రైతు మృతి చెందాడు. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగిలిగొండ గ్రామానికి చెందిన రైతు చాట్ల పరంజ్యోతి రోజువారీలాగే తన పాడి గేదెలను మేత కోసం పొలానికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో గేదెలను కడిగేందుకు, వాటికి నీళ్లు పెట్టేందుకు ఆయన గ్రామ చెరువులోకి దిగాడు. అయితే, చెరువులో నీటి లోతును సరిగ్గా అంచనా వేయలేకపోవడం, దానికి తోడు ఆయనకు ఈత రాకపోవడంతో ఒక్కసారిగా నీటిలో మునిగిపోయాడు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో నీటి నుంచి బయటకు రాలేక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
పరంజ్యోతి ప్రతిరోజూ సాయంత్రానికల్లా ఇంటికి చేరుకునేవాడు. అయితే రాత్రి ఎంతైనా ఆయన రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు రాత్రంతా పరిసర ప్రాంతాల్లో వెతికారు. శనివారం ఉదయం గ్రామ చెరువు వద్దకు వెళ్లి చూడగా, పరంజ్యోతి మృతదేహం నీటిపై తేలియాడుతూ కనిపించింది. పరంజ్యోతి హఠాన్మరణంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నాగిలిగొండలో విషాదం.. చెరువులో మునిగి రైతు మృతి!

