హైదరాబాద్‌లో ఐస్‌క్రీం తింటున్నారా.. జర జాగ్రత్త!

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని (Hyderabad) మెహదీపట్నంలో కల్తీ ఐస్‌క్రీం (Ice Cream) విక్రయిస్తున్న ముఠా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. అహ్మద్‌నగర్ పరిధిలోని అలియా ఐస్‌ క్రీమ్‌ పార్లర్‌పై గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఎలాంటి ట్రేడ్ లేదా ఫుడ్ లైసెన్స్‌లు లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో ఐస్ క్యాండీలు, లస్సీలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వీటి తయారీలో ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే ప్రమాదకరమైన రసాయనాలను వాడుతున్నట్లు విచారణలో తేలింది.

ఈ అక్రమ దందాకు పాల్పడుతున్న నిందితుడు సయ్యద్ ముషరఫ్ ఉద్దీన్‌ను పోలీసులు అరెస్ట్ చేయడమే కాకుండా, ఘటనా స్థలం నుంచి సుమారు రూ. 5.44 లక్షల విలువైన యంత్రాలు, భారీ మొత్తంలో నిల్వ ఉంచిన కల్తీ ఐస్‌క్రీం స్టాక్‌ను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఈ కేసును మెహదీపట్నం పోలీసులకు అప్పగించారు. కేవలం మెహదీపట్నంలో మాత్రమే కాకుండా హైదరాబాద్‌లో పలు చోట్ల కల్తీ ఐస్ క్రీం తయారుచేస్తున్నట్లు అధికారుల దృష్టికొచ్చింది.

కల్తీ ఐస్‌క్రీంతో కలిగే నష్టాలివే..

కల్తీ ఐస్‌క్రీం లేదా రసాయనాలతో తయారు చేసిన ఐస్ క్యాండీలు తినడం వల్ల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు వాటిల్లుతుంది. ముఖ్యంగా వీటి తయారీలో వాడే అపరిశుభ్రమైన నీరు, తక్కువ ధరలో లభించే సింథటిక్ కలర్స్ డయేరియా, కలరా, టైఫాయిడ్ వంటి జీర్ణకోశ వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ఈ హానికరమైన రసాయనాలు శరీరంలో చేరడం వల్ల కాలేయం (Liver), కిడ్నీలు దెబ్బతినడమే కాకుండా దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీయవచ్చు. అంతేకాకుండా, ఇవి పిల్లల్లో రోగనిరోధక శక్తిని తగ్గించి గొంతు ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతాయి. అందుకే వినియోగదారులు కేవలం FSSAI గుర్తింపు ఉన్న నాణ్యమైన ఐస్‌క్రీంలను మాత్రమే ఎంచుకోవడం ఆరోగ్యకరం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>