కలం, ఖమ్మం బ్యూరో: నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టీ రూ.9 లక్షలు లోన్ (Fake Gold Loan) తీసుకున్న ఘటన ఖమ్మం (Khammam) జిల్లా ఏనుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కల్లూరు డివిజన్, ఏన్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి బ్యాంకు రుణాలు పొందిన నలుగురు నిందుతులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు.
ఏన్కూర్ గ్రామీణ బ్యాంకు శాఖా నిర్వాహకులు కె.వి. ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏన్కూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. విచారణలో భాగంగా 2024 సంవత్సరంలో బ్యాంకులో బంగారు ఆభరణాల విలువ నిర్ధారించే అధికారి (గోల్డ్ అప్రైసర్) శ్రీపాది సతీష్ (A1), శ్రీపాది మౌనిక (A2), రామచంద్రోజు జయమ్మ (A3),రామచంద్రోజు నరేష్ (A4)లు కుమ్మక్కై సుమారు 242.25 గ్రాముల బరువున్న నకిలీ బంగారు ఆభరణాలను (Fake Gold Loan) అసలైనవిగా తాకట్టు పెట్టి రూ. 9.53 లక్షలు రుణాలుగా పొందినట్లు పేర్కొన్నారు. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో ఇటీవల ఆ ఖాతాలు నిరర్థక ఆస్తులుగా మారాయని, దీంతో బ్యాంకు అధికారులు వేలం ప్రక్రియను చేపట్టారని తెలిపారు. ఆసమయంలో తాకట్టు పెట్టిన ఆభరణాలు నకిలీవని గుర్తించిన అధికారులు, ముగ్గురు నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. అయితే ప్రస్తుతం శ్రీ పాది మౌనిక పరారీలో ఉన్నట్లు వివరించారు. ఎవరైనా ఇటువంటి మోసపూరిత చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తప్పని ఏసీపీ అన్నారు.
Read Also: 48 గంటల్లోనే మరో బాంబ్ పేల్చిన ఒరాకిల్.. భారీగా లేఆఫ్స్
Follow Us On : WhatsApp

