కలం, వెబ్ డెస్క్: ఈ రోజుల్లో పొద్దున్న లేచింది మొదలు పడుకునే వరకు మన కళ్లు ఫోన్లకో, కంప్యూటర్లకో అతుక్కుపోయే ఉంటున్నాయి. దీనివల్ల చాలామంది చిన్న వయసులోనే కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే, కొన్ని చిన్న చిన్న మార్పులతో మన కంటి ఆరోగ్యాన్ని (Eye Care Tips) మెరుగుపరుచుకోవచ్చని ఆస్టర్ ఆర్‌వీ హాస్పిటల్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ జయశ్రీ భట్ చెబుతున్నారు. అద్దాలు వాడాల్సిన అవసరం రాకుండా ఉండాలన్నా, ఉన్న సమస్య పెరగకుండా ఉండాలన్నా ఈ సహజ పద్ధతులు బాగా పనిచేస్తాయని ఆమె వివరించారు.
స్క్రీన్ చూసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పవు:
మనం స్క్రీన్ (Screen) చూస్తున్నప్పుడు కళ్లు ఆర్పడం మర్చిపోతుంటాం, దీనివల్ల కళ్లు పొడిబారిపోతాయి. అందుకే డాక్టర్లు ముఖ్యంగా కొన్ని సూచనలు చేస్తున్నారు:
20-20-20 సూత్రం: ప్రతి 20 నిమిషాలకు ఒకసారి.. కనీసం 20 సెకన్ల పాటు.. 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును చూడండి. దీనివల్ల కంటి కండరాలకు మంచి విశ్రాంతి దొరుకుతుంది.
నిద్ర ముఖ్యం: కళ్లు మళ్లీ ఉత్తేజితం కావాలంటే రోజుకు కనీసం 7 నుండి 9 గంటల నిద్ర తప్పనిసరి. నిద్ర సరిగ్గా లేకపోతే చూపు మసకబారడం ఖాయం.
నీళ్లు తాగండి: ఒంట్లో నీరు తగ్గితే కళ్లు కూడా పొడిబారుతాయి. అందుకే రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీళ్లు తాగాలి. అలాగే బయటకు వెళ్లినప్పుడు ఎండ తగలకుండా సన్ గ్లాసెస్ వాడటం మంచిది.
కంటికి కావాల్సిన వ్యాయామాలు:
దృష్టి లోపాలను ఇవి పూర్తిగా తొలగించలేకపోయినా, కళ్ల మీద ఒత్తిడి తగ్గించడానికి ఇవి బాగా సహాయపడతాయి:
కళ్లు తిప్పడం: వెన్నుముక నిటారుగా ఉంచి, కనుగుడ్లను మెల్లగా క్లాక్‌వైజ్, యాంటీ-క్లాక్‌వైజ్ దిశల్లో తిప్పాలి. ఇది కంటి కండరాలను దృఢంగా చేస్తుంది.
దృష్టిని మార్చడం: మీ బొటనవేలును ముఖానికి దగ్గరగా పెట్టుకుని చూస్తూ.. వెంటనే దూరంగా ఉన్న వస్తువును చూడండి. ఇలా పది సార్లు చేయడం వల్ల కంటి లెన్స్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.
తినాల్సిన ఆహారం: మంచి చూపు కావాలంటే క్యారెట్లు, పాలకూర వంటి ఆకుకూరలు డైట్‌లో ఉండేలా చూసుకోవాలి. అలాగే చేపలు, నారింజ వంటి పండ్లు, విత్తనాలు తింటే కంటి శుక్లాలు రాకుండా అడ్డుకోవచ్చని డాక్టర్ జయశ్రీ సూచించారు.

