కలం, కరీంనగర్ బ్యూరో: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సాగుతున్న భీకర యుద్ధం కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని గ్రానైట్ ఎగుమతుల (Granite Exports) వ్యాపారాన్ని దెబ్బతీసింది. వర్కర్లకు పనిలేకుండా పోయింది. మరికొద్ది రోజులు ఇలానే కొనసాగితే పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుందని గ్రానైట్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా కరీంనగర్, ఖమ్మం జిల్లాల నుంచి గ్రానైట్ ఎగుమతులు చైనాతో పాటు ఇరాన్, కువైట్, సౌదీ అరేబియా, ఇరాక్, ఖతార్, ఒమన్ వంటి పశ్చిమాసియా దేశాలకు జరుగుతాయి. ఇరాన్ యుద్ధ పరిస్థితులతో హార్ముజ్ జలమార్గాన్ని మూసివేయడంతో సరుకు రవాణాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. చెన్నై షిప్ యార్డు నుంచి సరుకు తీసుకెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పటికే గ్రానైట్ స్లాబ్‌లు, టైల్స్‌తో వెళ్లిన కంటైనర్లు వివిధ ఓడరేవుల్లో ఆగిపోయాయి. వార్సెస్గా ఒక్కో కంటైనర్ నుంచి రూ.2 లక్షల వరకు విధిస్తుండగా వ్యాపారులకు ఆర్థిక భారం తప్పడం లేదు. వార్సెస్ దెబ్బకు కొన్ని షిప్పులు వెనక్కి తిరిగొస్తున్నాయి. ఇలా అంతర్జాతీయ సముద్ర రవాణాలో ఏర్పడిన ఆటంకాలు (కంటైనర్లు నిలిచిపోవడం), పెరిగిన చమురు ధరలు, వార్సెతో గ్రానైట్ పరిశ్రమ ఉక్కిరిబిక్కిరవుతోంది.
పెరిగిన ధరలతో ప్రతిబంధకాలు
క్రూడ్ఆయిల్ కొరతతో రవాణా ఖర్చులు అధికమై గ్రానైట్ వ్యాపారులకు భారంగా మారింది. గతంలో ఒక కంటైనర్‌కు 21 డాలర్లు చార్జీలుగా ఉండేవి. యుద్ధం కారణంగా ప్రస్తుతం 28 డాలర్లకు చేరింది. మరోవైపు యుద్ధం ఎఫెక్ట్‌తో క్రూడ్ఆయిల్ కొరత ఏర్పడింది. రవాణా ఖర్చులు పెరగడమే కాకుండా, క్వారీల్లో వాడే గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ మెషీన్లు, విడిభాగాలు ఇతర పరికరాల ధరలు భారీగా పెరిగిపోయాయి. గతంలో రూ. 250 ఉన్న డ్రిల్లింగ్ బిట్టు ఇప్పుడు రూ. 1200 చేరింది. టూల్స్‌లో ఫిన్లాండ్ నుంచి టిమ్మర్, ఇతర ఆరు మెషినరీ స్పేర్ పార్ట్స్ వచ్చే సముద్ర రూట్ పూర్తిగా బంద్ అయ్యింది. ఇది కాస్త గ్రానైట్ ఎగుమతికి ప్రతిబంధకాలుగా మారాయి. వేల మందికి ఉపాధి కష్టాలు కరీంనగర్ జిల్లాలో 500 , ఖమ్మం జిల్లాలో 450కి పైగా గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 వేల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నది. సుమారు 8 రాష్ర్టాలకు చెందిన కార్మికులుగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు.
ప్రతి నెల 50 వేల టన్నులు గ్రానైట్ విదేశాలకు ఎగుమతి (Granite Exports) అవుతుంది. ప్రతి క్వారీకి రోజుకు సగటున 1000 లీటర్ల డీజిల్ అవసరం. పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా బల్క్‌గా కంపెనీలకు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఒకవేళ ప్రభుత్వం డీజిల్ సరఫరాపై రేషన్ విధిస్తే ఉత్పత్తి 50 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని గ్రానైట్ క్వారీల యజమానులు పేర్కొంటున్నారు. క్రూడ్ఆయిల్ ధరలు పెంచితే పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారనుందని ఆందోళన చెబుతున్నారు. కరోనా తర్వాత నుంచి మాంద్యం దెబ్బతో పరిశ్రమ ఇంకా కోలుకోవడం లేదు. తాజాగా ఇరాన్ యుద్ధం మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టిందని గ్రానైట్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మూడు నెలలే బిజినెస్
ప్రస్తుతం ఎండాకాలం కావడంతో గ్రానైట్ కటింగ్, పాలిషింగ్‌కు అత్యంత అనువైన సమయం. వానాకాలం మొదలైతే పనులు మందగిస్తాయని పరిశ్రమ యజమానులు అంటున్నారు. ఈ మూడు నెలల సీజన్‌లోనే పనులు ఆగిపోతే వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి డీజిల్ సరఫరాలో లోపాలు లేకుండా చూడాలని, ప్రస్తుత సంక్షోభం నుంచి పరిశ్రమను గట్టెక్కించేందుకు రాయితీలు ప్రకటించాలని కరీంనగర్ గ్రానైట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ కోరారు.
Read Also: వేసవిలో చర్మ సౌందర్యం కోసం ఈ జ్యూస్ తాగండి
Follow Us On: X(Twitter)

