కలం మెదక్ బ్యూరో: ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతిచెందిన ఘటన మెదక్ (Medak) జిల్లాలో చోటుచేసుకుంది. హవేలీ ఘన్‌పూర్ మండల పరిధిలోని గంగాపూర్ గ్రామ శివారులో మెదక్–రామాయంపేట జాతీయ రహదారిపై వాహనం ఢీకొనడంతో చిరుత అక్కడికక్కడే మృతి చెందింది. రహదారిపై చిరుత మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు, హవేలీ ఘన్‌పూర్ పోలీసులకు సమాచారం అందించారు.
అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుత మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం వెటర్నరీ వైద్యుడితో పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అటవీశాఖ నిబంధనల ప్రకారం చిరుత మృతదేహాన్ని ఖననం చేయనున్నట్లు తెలిపారు. చిరుత మృతికి కారణమైన గుర్తుతెలియని వాహనం కోసం పోలీసులు, అటవీశాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

