కలం, వరంగల్ బ్యూరో: గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ సర్కార్ రైతులను ఇబ్బందులు పెడుతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) హితవు పలికారు. శుక్రవారం ఆయన వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో పలు గోదాంలను పరిశీలించారు. ఈ సందర్బంగా రైతులు వారి గోడు వెళ్ల బోసుకున్నారు.
అనంతరం ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం మెడలు వంచైనా రైతుల పక్షాన ఉద్యమిస్తామని , ప్రతి గింజ కొనే వరకు పోరాడుతామన్నారు. ఎర్రటి ఎండలో రైతులను చూస్తే రేవంత్ రెడ్డి కి గోస అనిపిస్తా లేదా అని ప్రశ్నించారు. బోగస్ మాటలు, చిల్లర మాటలు మానుకొని రైతుల, మొక్కజొన్న, వరి కొనుగోలు పై శ్రద్ధ పెట్టాలన్నారు.
బస్తాల కొరత, మొక్కజొన్న కొనుగోలు సరిగా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రైతులకు విత్తనాలు, ఎరువులు ఇవ్వలేకపోతోందని ఆరోపించారు. సకాలంలో రైతుబంధు ఇవ్వకపోగా.. కనీసం పండిన పంటను మద్దతు ధరకు కొనే పరిస్థితిలో కూడా లేదన్నారు. ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. కొనుగోళ్లు లేక వారం రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నామని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని.. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడాలని ఆయన (Errabelli Dayakar Rao) డిమాండ్ చేశారు.
Read Also: బీఆర్ఎస్‌కు షాక్.. కాళేశ్వరంపై రేవంత్ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
Follow Us On: WhatsApp

