పోలీసుశాఖలో బదిలీల లొల్లి

కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ (Nalgonda) జిల్లా పోలీస్ శాఖలో ఇటీవల జరిగిన సాధారణ బదిలీలు (Police Transfers) పెను దుమారాన్ని రేపుతున్నాయి. “కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు” అన్న చందంగా ఉన్నతాధికారులు భారీ కసరత్తు చేసినట్లు కనిపించినా.. అంతిమంగా అవినీతి తిమింగలాలకే మళ్లీ పట్టం కట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా ఒక స్టేషన్‌లో నిర్ణీత కాలం (కానిస్టేబుల్ 5 ఏండ్లు, హెడ్ కానిస్టేబుల్ 4 ఏండ్లు, ఏఎస్ఐ 3 ఏండ్లు) పూర్తి చేసుకున్న వారిని బదిలీ చేయాల్సి ఉండగా, ఈసారి ఆ నిబంధనలు గాలికొదిలేశారు. ఈ పోలీస్ బదిలీ (Police Transfers)ల వెనుక భారీ స్థాయిలో ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తమకు అణుకువగా ఉంటూ, వసూళ్లలో సహకరించే కింది స్థాయి సిబ్బందిని స్టేషన్ అధికారులు, సర్కిల్ అధికారులు వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. దీంతో నిజాయతీగా పనిచేసే వారికి తీరని అన్యాయం జరుగుతోంది. మొత్తానికి నల్లగొండ జిల్లా పోలీస్ శాఖలో బదిలీల పర్వం వివాదాస్పదంగా మారింది. పారదర్శకతకు పాతరేస్తూ.. నిబంధనలను తుంగలో తొక్కి తమకు కావాల్సిన వారికే పట్టం కట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏండ్ల తరబడి ఒకే చోట పాతుకుపోయిన ‘ముదురు’ సిబ్బందిపై వేటు పడుతుందని ఆశించిన నిజాయతీ గల అధికారులకు నిరాశే ఎదురైంది.

అదే స్టేషన్.. అదే కుర్చీ!

నల్లగొండ జిల్లాలో కొంతమంది అధికారులు ఒకే పోలీస్ స్టేషన్‌లో 5 ఏళ్లు పూర్తి చేసుకున్నా.. వారిని మార్చకుండా మళ్లీ అదే స్టేషన్‌లో కొనసాగించడం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మరీ విడ్డూరంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని కొన్ని కీలక స్టేషన్లలో గత 10 ఏళ్లుగా తిష్టవేసిన కొందరు ‘ముదురు’ కానిస్టేబుళ్లకు తిరిగి అదే చోట పోస్టింగ్ ఇచ్చారు. దీనివల్ల వారు ఏకంగా 15 ఏళ్ల పాటు ఒకే సర్కిల్‌లో రాజ్యమేలే అవకాశం దక్కింది. గత 15 రోజుల క్రితం జిల్లా బాస్ కఠినంగా వ్యవహరించి.. ఒక చోట ఆర్డర్ ఉండి మరోచోట డ్యూటీ చేస్తున్న వారిని తక్షణం మాతృ సంస్థలకు వెళ్లాలని ఆదేశించారు. జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రక్షాళన అవుతుందని అంతా భావించే లోపే.. సీన్ రివర్స్ అయింది. స్టేషన్, సర్కిల్, సబ్ డివిజన్ అధికారులు “ఇతడు మా వాడు.. ఇతడు మాకు కావాలి” అంటూ పైరవీలు మొదలుపెట్టి.. తమకు అనుకూలమైన వారిని మళ్లీ వెంటే తీసుకెళ్లడం విస్మయానికి గురి చేస్తోంది.

అటాచ్‌మెంట్ మాయాజాలం

ఒక స్టేషన్‌లో 5 ఏళ్లు పనిచేసి బదిలీ అయిన వ్యక్తిని కేవలం నెల రోజుల వ్యవధిలోనే మళ్లీ ‘అటాచ్‌మెంట్’ పేరుతో పాత స్టేషన్‌కే పిలిపించుకుంటున్నారు. ఇలా ఏండ్ల తరబడి ఒకే సర్కిల్ చుట్టూ తిరుగుతున్న అధికారుల అక్రమాలు ఉన్నతాధికారులకు ఎందుకు కనిపించడం లేదని కింది స్థాయి సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. రైటర్లు, కోర్టు డ్యూటీ, క్రైమ్ విభాగాల్లో అవినీతి ఆరోపణలు ఉన్న వారి జాబితా నిఘా విభాగం ఇచ్చినా, వారిని మళ్లీ అదే స్థానాల్లో కూర్చోబెట్టడం వెనుక మర్మమేంటో అర్థం కావడం లేదు. “మాకు రాజకీయ బలం లేదు.. పై అధికారులకు ముడుపులు ఇచ్చుకోలేము. ఆరోగ్య సమస్యలు, పిల్లల చదువులు ఉన్నా మమ్మల్ని పట్టించుకునే వారు లేరా?” అని వయసు పైబడిన కానిస్టేబుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కింది స్థాయి సిబ్బంది వాదన మరోలా ఉంది. “పై స్థాయి అధికారులే జిల్లాలో పక్క పక్క స్టేషన్లు మారుతూ ఏండ్ల తరబడి ఇక్కడే ఉంటున్నప్పుడు, మమ్మల్ని అనడానికి ఏముంది?” అని వారు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి.. ఈ అరుదైన అక్రమ బదిలీలను రద్దు చేసి, అర్హులైన వారికి న్యాయం చేయాలని జిల్లా పోలీస్ వర్గాలు కోరుతున్నాయి.

Read Also: నగరంలో ప్రధాని మోదీ పర్యటన: ఆ ప్రాంతాల్లో కీలక ఆంక్షలు!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>