కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలోని 2వ డిపో పరిధిలో షార్ట్ సర్క్యూట్‌తో ఎలక్ట్రిక్ బస్సు (Electric Bus) దగ్ధమైంది. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. డిపోలో ఎలక్ట్రిక్ బస్సులు నిలిపి ఉంచే స్థలంలో ఒక బస్సుకు ఛార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బ్యాటరీ విభాగంలో మంటలు ప్రారంభం కావడంతో అవి వేగంగా బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ ఎలక్ట్రిక్ బస్సు దాదాపు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదాన్ని గమనించిన డిపో సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఫైర్ ఇంజన్ తో ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఛార్జింగ్ పాయింట్ వద్ద ఉన్న మిగతా బస్సులకు మంటలు వ్యాపించకుండా అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, బస్సు పూర్తిగా కాలిపోవడంతో భారీగానే ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ అధికారులు ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నారు. ఇటీవల అలుగునూరులో సైతం ఓ ఆర్టీసీ బస్సు ఇలాగే పూర్తిగా దగ్ధమైంది. వరుస ఘటనలపై ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కరీంనగర్‌లో మరో ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం..!

