కలం, తెలంగాణ బ్యూరో: “ఓటర్ల జాబితా (Voter List)లో పేరు లేనట్లయితే రేషన్ కార్డు సహా ఎలాంటి సంక్షేమ పథకాల ఫలాలు అందుకోడానికి అర్హత ఉండదు. భవిష్యత్తులో బ్యాంకు పాస్ బుక్‌లను కూడా రద్దు చేయాల్సిందిగా కోరతాం. ‘అన్నపూర్ణ భండార్’ స్కీమ్ కింద నెలకు రూ. 3వేల సాయం తీసుకునే మహిళలకు ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోతే వాళ్లకు ఆ స్కీమ్ కూడా అందదు’’.. ఇవీ మే 12న బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి చేసిన కామెంట్లు.
‘‘సర్ ప్రక్రియ (SIR Drive) తర్వాత ఓటర్ల జాబితా నుంచి పేర్లు డిలీట్ అయినవారు సంక్షేమ పథకాల జాబితా నుంచి కూడా డిలీట్ అవుతారు. ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్.. ఈ నాలుగు కారణాలతో ఓటర్ల జాబితా నుంచి పేరు డిలీట్ అయినట్లయితే వారిని సంక్షేమ పథకాల లిస్టు నుంచి తొలగించాలి. గతేడాది డిసెంబర్ 6న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విడుదల చేసిన తుది జాబితా ప్రామాణికంగా ఉంటుంది.’’.. ఇదీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జూన్ 4న జారీ చేసిన ఉత్తర్వులు.
“సర్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే పేదలకు అన్యాయం జరుగుతుంది. అది భవిష్యత్తులో అనేక అనర్థాలకు దారితీస్తుంది. ఓటర్ కార్డు లేకపోతే భవిష్యత్తులో రేషన్ కార్డు, ఆధార్ కార్డు పోతుంది. ప్రజలకు అన్యాయం జరగనివ్వొద్దు. ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడం కోసం బీజేపీ చేస్తున్న కుట్రలను నిశితంగా పరిశీలిస్తూ తిప్పికొట్టాలి.”.. ఇవీ జూన్ 24న కాంగ్రెస్ నేతలతో జూమ్ మీటింగ్‌లో సీఎం రేవంత్ చెప్పిన మాటలు.
‘‘సర్ ప్రారంభమైన సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ఓటు హక్కు కోల్పోతే భవిష్యత్‌లో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా కోల్పోయే పరిస్థితి రావొచ్చు. బెంగాల్‌లో ‘సర్’ ఆధారంగా ఓటు లేని వాళ్లకు రేషన్ కార్డుల జాబితా నుంచి తొలగించే చర్యలు చేపట్టారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి రావొచ్చు. ఓటు హక్కును నిర్లక్ష్యం చేయొద్దు… మంగళవారం ‘సర్’కు తన వివరాలు ఇచ్చిన తర్వాత కర్నాటక సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు.
పశ్చిమ బెంగాల్‌లో జారీ అయిన ఉత్తర్వులు, బీహార్ సీఎం చేసిన కామెంట్లు.. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ ఇచ్చిన అలర్ట్.. తాజాగా కర్నాటక సీఎం డీకే శివకుమార్ చేసిన సూచనలు.. ఇవన్నీ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ(సర్)తో ఏదో జరగబోతున్నదన్న అనుమానాలకు తావిస్తున్నాయి. ఓటర్ల జాబితాలో పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాల్సిందేనని, ఓటు కోల్పోతే ప్రభుత్వ పథకాలు కూడా కోల్పోవాల్సి వస్తుందన్న సంకేతాలకు బలం చేకూరుస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే ‘సర్’ ప్రక్రియ ప్రారంభమైనందున జనం అలర్ట్‌గా ఉండాలని, తగిన ఆధారాలు ఇచ్చి ఓటరు జాబితాలో పేరు ఉండేలా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కొన్నిరోజుల నుంచి సూచిస్తున్నది. అన్ని పార్టీల నేతలు కూడా దీనిపైనే ఫోకస్ పెట్టారు.
దేశవ్యాప్తంగా జరుగుతున్న ‘సర్’ అనేక సందేహాలకు కారణమైంది. ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో జరుగుతున్న ఈ కసరత్తు మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే అనుమానాలకు తావిస్తున్నది. ‘సర్’ ప్రక్రియ కేవలం ఓటర్ల జాబితా వరకే పరిమితం కాకపోవచ్చని, సంక్షేమ పథకాల అర్హతకు కూడా లింకు పెట్టే ప్రమాదం ఉన్నదనే ఆందోళన నెలకొన్నది. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూన్ 4న వెలువడిన ఉత్తర్వులు ఈ అనుమానాలకు బలం చేకూర్చాయి.
దీనికి ముందు బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి చేసిన వ్యాఖ్యలు కూడా అదే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కూడా వారం రోజుల ముందు ఇలాంటి ప్రమాదం చోటుచేసుకోవచ్చని సంకేతాలిచ్చారు. తాజాగా కర్నాటక సీఎం డీకే శివకుమార్ సైతం ఈ వాదనలకు బలం చేకూర్చే తరహాలోనే మాట్లాడారు. ఓటరు జాబితాలో పేరు మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాల్సిందేనని ఇతర నేతలు కూడా పదే పదే సూచిస్తున్నారు.
గతంలో ఆధార్.. ఇప్పుడు ఓటర్ కార్డు
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డును అనుసంధానించడం నిబంధనగానే అమలవుతున్నది. రేషన్ కార్డు మొదలు పింఛన్ వరకు అన్నింటికీ ఆధార్ కార్డు వివరాలను ఇవ్వడం తప్పనిసరిగా మారింది. చివరికి బ్యాంకు ఖాతాకు సైతం ఇది ఒక షరతుగానే అమలవుతున్నది. ఆధార్ కార్డు స్థానాన్ని భవిష్యత్తులో ఓటర్ కార్డు రిప్లేస్ చేస్తుందేమోనన్న ఆందోళన మొదలైంది.
– సర్ ప్రక్రియ మొత్తం ముగిసి తుది జాబితా వెలువడిన తర్వాత ఏం జరగబోతుందనే అనుమానాలు వస్తున్నాయి. ఓటు వేసే సమయానికి మాత్రమే ఓటర్ గుర్తింపు కార్డు మనకు గుర్తుకొస్తుంది. మిగిలిన సమయాల్లో దాని గురించే పట్టించుకోం. కానీ, ఇప్పుడు ఓటర్ కార్డును సంక్షేమ పథకాలకు అనుసంధానం చేయనున్నట్లు బెంగాల్లో ఉత్తర్వులు రావడం, ముఖ్యమంత్రులు కామెంట్ చేయడంతో ఏదో జరగబోతున్నదన్న అలజడి మొదలైంది.
బెంగాల్ ఉత్తర్వులతో అనుమానాలు
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జూన్ 4న సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను ఓటరు జాబితాతో సరిపోల్చాలని అధికార యంత్రాంగానికి ఆ ప్రభుత్వంలోని ఫుడ్ అండ్ సప్లయీస్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ సెక్రటరీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘సర్’ ప్రక్రియ తర్వాత ఓటర్ల జాబితా నుంచి పేర్లు డిలీట్ అయినవారు సంక్షేమ పథకాల జాబితా నుంచి కూడా డిలీట్ అవుతారని అందులో ప్రస్తావించారు. మొత్తం ఐదు అంశాలను ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్.. ఈ నాలుగు కారణాలతో ఓటర్ల జాబితా నుంచి పేరు డిలీట్ అయినట్లయితే వారిని సంక్షేమ పథకాల లిస్టు నుంచి తొలగించాలి. ఏదేని పరిస్థితుల్లో ఓటర్ల జాబితా నుంచి పేరు డిలీట్ అయిన తర్వాత ట్రిబ్యునల్ దగ్గర అప్లికేషన్ పెట్టుకుని దాని విచారణ పెండింగ్‌లో ఉన్నట్లయితే ఫైనల్ నిర్ణయం వెలువడేంత వరకు రేషన్ కార్డు, సంక్షేమ ఫలాలు అందుకోడానికి అర్హత ఉంటుంది. గతేడాది డిసెంబర్ 6న సీఈఓ విడుదల చేసిన తుది జాబితా ప్రామాణికంగా ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
బీహార్ సీఎం కూడా అదే చెప్పారు
– “ఓటర్ల జాబితాలో పేరు లేనట్లయితే రేషన్ కార్డు సహా ఎలాంటి సంక్షేమ పథకాల ఫలాలు అందుకోడానికి అర్హత ఉండదు” అని బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి మే 12న వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన రెండుమూడురోజులకే బీహార్ సీఎం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భవిష్యత్తులో బ్యాంకు పాస్ బుక్‌లను కూడా రద్దు చేయాల్సిందిగా కోరతామన్నారు.
– బీహార్ ప్రభుత్వం ‘అన్నపూర్ణ భండార్’ స్కీమ్ కింద ప్రతి నెలా మహిళలకు రూ. 3 వేల చొప్పున సాయం చేస్తున్నది. ఓటర్ల జాబితాలో పేర్లు లేని మహిళలు ఈ పథకానికి అర్హత కోల్పోనున్నట్లు సీఎం సామ్రాట్ చౌదరి వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలకు తగినట్లుగా బీహార్ ప్రభుత్వం ఉత్తర్వులేవీ వెలువరించలేదు.
– ఎన్నికల జాబితాలో ఓటర్లు వారి పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా సామ్రాట్ చౌదరికి ముందు ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్ కుమార్ పదేపదే ప్రజలను అప్రమత్తం చేశారు. కానీ, సంక్షేమ పథకాలకు లింకు పెట్టే ప్రమాదాన్ని ఆయన మాటల్లో ఆ రాష్ట్ర పేద కుటుంబాలు గ్రహించలేకపోయాయి.
తెలంగాణ, కర్నాటక సీఎంల అలర్ట్
ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకోవడం ఇకపై కేవలం ఎన్నికల్లో ఓటు వేయడానికే పరిమితం కాదు.. సంక్షేమ పథకాలకూ అదే ప్రామాణికం.. అనేది బీహార్, బెంగాల్ ప్రభుత్వాల ధోరణితో స్పష్టమైంది. ఈ రెండు రాష్ట్రాల్లోని పరిణామాలను పరిగణనలోకి తీసుకున్నారో ఏమో.. అనర్థాలు జరుగుతాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అలర్ట్ చేశారు. రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియ ప్రారంభం కాకముందే ప్రజలను, కాంగ్రెస్ నేతలను ఆయన అప్రమత్తం చేశారు. ఓటు పోతే భవిష్యత్తులో సంక్షేమ పథకాలకు కోత పడొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటరు జాబితాలో పేరు ఉండేలా చూసుకోవాలని సూచించారు.
తాజాగా మంగళవారం కర్నాటక సీఎం డీకే శివకుమార్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రాష్ట్రాలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వమే ఓటర్ లిస్టుకు, వెల్ఫేర్ స్కీమ్స్కు లింకు పెట్టే కొత్త విధానాన్ని తీసుకొస్తుందేమో అనే చర్చలు మొదలయ్యాయి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఒక రాజ్యాంగబద్ధ హక్కు. కానీ, సంక్షేమ పథకాలు సామాజిక భద్రతలో భాగంగా ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ప్రభుత్వ సేవలను, సంక్షేమాన్ని పొందాలంటే తప్పనిసరిగా ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావడానికి అర్హులై ఉండాలనేది ఒక నిబంధనగా మారుతుందేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

