కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం(Bhadrachalam) ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అత్యంత హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. భద్రాచలం పట్టణానికి చెందిన ఓ వృద్ధుడు ఆసుపత్రిలో మృతి చెందగా, కనీసం ఉచితంగా ఇవ్వవలసిన అంబులెన్స్ కూడా అందుబాటులో లేకపోవడంతో మృతదేహాన్ని బంధువులు భుజాలపై మోసుకుని ఇంటికి తీసుకెళ్లాల్సి వచ్చింది.
వడదెబ్బతో వెంకన్న అనే వ్యక్తి మృతి చెందగా, మృతదేహాన్ని తరలించేందుకు ఆసుపత్రిలో అంబులెన్స్ దొరకలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది కూడా పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ ఘటనతో అక్కడున్నవారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో మార్పు లేకపోవడం విచారకరమని స్థానికులు అంటున్నారు. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

